NTV Telugu Site icon

Free Sand : ఏపీలో అమల్లోకి ఉచిత ఇసుక విధానం

Sand

Sand

రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. ఇసుకను ఉచితంగా సరఫరా చేసేందుకు వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏలూరు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి తదితర జిల్లాల కలెక్టర్లు ఉచిత ఇసుక సరఫరా ఏర్పాట్లపై సమీక్షించారు, స్టాక్ పాయింట్లలో తగినంత ఇసుక ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గనులు, భూగర్భ శాస్త్రం, రవాణా, రెవెన్యూ, పోలీసు శాఖల సిబ్బంది నదులు, కాలువల వెంట ఉన్న స్టాక్‌ పాయింట్లను సందర్శించి స్టాక్‌ పొజిషన్‌పై ఆరా తీశారు. ఏలూరు కలెక్టర్ కె.వెట్రి సెల్వి ఉంగుటూరు మండలం చేబ్రోలులోని స్టాక్ పాయింట్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆదివారం కుకునూరు మండలం వింజరం గ్రామంలోని స్టాక్‌ పాయింట్‌ను జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్య వేణి పరిశీలించారు. ఏలూరు జిల్లాలోని రుద్రమకోట, దాచారం, వింజరం, ఇబ్రహీంపట్నం, చేబ్రోలు స్టాక్‌ పాయింట్ల నుంచి ఇసుకను సరఫరా చేయనున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు.

“రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉచిత ఇసుక విధానం అమలు చేయబడుతుంది. ఒక వ్యక్తికి రోజుకు 20 టన్నుల ఇసుక ఇవ్వనున్నారు. వినియోగదారుల నుంచి సెగ్నియారేజీ, జీఎస్టీ మాత్రమే వసూలు చేస్తారు’’ అని అధికారులు తెలిపారు. స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. సృజన అధికారులను ఆదేశించారు , తహశీల్దార్లు , రెవెన్యూ , గనులు , భూగర్భ శాఖల అధికారులు ఈ విధానాన్ని సక్రమంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక సరఫరా అవుతుందని, తహశీల్దార్లు ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తూ సరఫరాను పర్యవేక్షించాలన్నారు. స్టాక్ పాయింట్ల వద్ద ధరలు, స్టాక్ లభ్యతతో కూడిన బోర్డులను ప్రదర్శించాలని అధికారులు తెలిపారు.

ఏలూరు జిల్లాలో రెండు స్టాక్ పాయింట్ల ద్వారా ఉచిత ఇసుక పంపిణీకి ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉంగుటూరు మండలం చేబ్రోలు, కుక్కునూరు మండలం వింజరం , ఇబ్రహీంపేట స్టాక్ పాయింట్లు నుంచి ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. ఐతే కొద్ది మొత్తంలో మాత్రమే అందుబాటులో ఇసుక ఉండడంతో స్టాకు మరింత పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు. గోదావరి వరద ఉధృతి పెరగడంతో పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక సరఫరాకు అంతరాయం ఏర్పడింది. స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు.ఉచిత ఇసుక పాలసీ అమలులోకి రావడంతో భవన నిర్మాణ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.