Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. అయితే ప్రచారానికి ఇవాళ సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. ఇక నవంబర్ 30న జరిగే ఓటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఎన్నికలను నియంత్రిత పద్ధతిలో నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. పోలింగ్ సిబ్బందికి శిక్షణ, నియోజకవర్గాల కేటాయింపు పూర్తయింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఓటర్ల మానసిక ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా చూడాలని, సినిమా హాళ్లు, టీవీ , ఇతర ప్రచార పరికరాల ద్వారా ఎన్నికలకు సంబంధించిన అంశాలను ప్రదర్శించవద్దని సీఈవో వికాసరాజ్ అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు స్పష్టం చేశారు. అయితే, ఎన్నికల ప్రచారంతో పాటు, పోలింగ్ రోజున ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజకీయ నేతలు సూచిస్తున్నారు. రాజకీయ నేతలతో పాటు సినీ, క్రీడా ప్రముఖులు, పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు కూడా ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బైక్ ట్యాక్సీ కంపెనీ రాపిడో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణలో పోలింగ్ రోజున ఓటర్లందరికీ ఉచిత ప్రయాణాన్ని ప్రకటించింది.
Read also: CM KCR: నేడు సిద్దిపేట, వరంగల్ లో సీఎం కేసీఆర్ పర్యటన
హైదరాబాద్ నగరంలోని మొత్తం 2,600 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను ఉచితంగా చేరవేస్తామని రాపిడో కంపెనీ వెల్లడించింది. పోలింగ్ కేంద్రాలు, ప్రయాణ ఖర్చుల కారణంగా కొంత మంది తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవచ్చనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను ప్రకటించినట్లు రాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుండుపల్లి తెలిపారు. నగరంలో ఎక్కడి నుంచైనా తమ పోలింగ్ బూత్ కు ఉచితంగా వెళ్లేందుకు తమ సంస్థ సహాయం చేస్తుందన్నారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలనుకునే ఓటర్లకు తమవంతు సాయం చేస్తామని చెప్పారు. తమ ఉచిత ప్రయాణ ఆఫర్ ముఖ్యంగా యువ ఓటర్లను పోలింగ్ స్టేషన్‌లకు ఆకర్షించడంలో ఉపయోగకరంగా ఉంటుందని వారు భావిస్తున్నారు. ప్రజాస్వామ్యం భారతదేశానికి ఆభరణమని.. ఆ ప్రజాస్వామ్యం ఇచ్చిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పవన్ పిలుపునిచ్చారు.
Telangana Elections: నేటి సాయంత్రంతో ప్రచారానికి తెర.. మూతపడనున్న మైకులు