NTV Telugu Site icon

Free Petrol: ఉచితంగా పెట్రోల్.. బారులు తీరిన వాహనదారులు

Free Petrol

Free Petrol

Free Petrol: అసలే పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. బండికి పెట్రోల్ కొట్టించుకోలేక చాలామంది ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. కొంతమంది పెట్రోల్ బైకులను పక్కనపెట్టి బ్యాటరీ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ సమయంలో పెట్రోల్ ఫ్రీగా వస్తుందంటే ఎవరైనా వదులుతారా. రండి బాబు రండి అని చెప్పగానే… వందలాది వాహనాలు క్యూ కట్టాయి. ఎంతలా అంటే పోలీసులు కూడా వారిని కంట్రోల్ చేసే అంత స్థాయికి వచ్చింది. పరిమితంగానే పెట్రోల్ పోసి ఆ తర్వాత ఆపేసారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఈ ఘటన జరిగింది. ఫ్రీ పెట్రోల్ అని చెప్పడంతో.. నక్కపల్లిలోని స్థానిక పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కోసం బైకులతో జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు. తీరా అక్కడికి వెళ్లాక అసలు విషయం తెలిసి ఉసూరుమంటూ వెనక్కు వచ్చేశారు.

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని ఓ సంస్థ ప్రతినిధి తన కుటుంబ సభ్యుడి జన్మదినం సందర్భంగా పెట్రోలు ఫ్రీగా పంపిణీ చేయాలని అనుకున్నాడు. ఒక్కొక్కరికి రెండు లీటర్ల పెట్రోల్ చొప్పున కూపన్లను పంపిణీ చేశాడు. నక్కపల్లి పెట్రోల్ బంకులో పెట్రోల్ పంపిణీకి సిద్ధం అయ్యారు. రెండు లీటర్ల పెట్రోల్ కూపన్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రచారం చేయడంతో జనం వాహనాలతో భారీగా చేరుకున్నారు. 150 మందికి కూపన్లు పంపిణీ చేశారు. కాగా ఫ్రీ పెట్రోల్ వ్యవహారం ఆ నోట ఈ నోటా పాకడంతో జనం వాహనాలతో బారులు తీరారు. జనాలు ఒక్కసారిగా పెట్రోల్ బంక్‌కు ఎగబడ్డారు.. ఇక్కడ భారీగా రద్దీ ఏర్పడటంతో రహదారి వెంట వెళ్లే వాళ్లు ఏమి జరుగుతుందో అర్థంకాక ఆశ్చర్యంగా చూశారు. అసలు విషయం తెలుసుకుని అక్కడికి పరుగులు తీశారు. పోలీసులు వీరిని నియంత్రించి.. ఆ తర్వాత కూపన్లను పంపిణీ చేయించారు.

Read Also: Ashada bonalu: గోల్కొండలో ఆషాడ బోనాలు.. ఉత్సవాల నిర్వహణకు రూ.15 కోట్లు

150మందికే ఫ్రీగా పెట్రోల్, డీజిల్ అనడంతో ఆ తర్వాత వచ్చినవాళ్లు ఉసూరుమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతమంది జనాల్ని చూసి పెట్రోల్ బంక్ సిబ్బంది అవాక్కయ్యారు. ముందు జాగ్రత్తగా ఎస్.రాయవరం ఎస్సై ప్రసాదరావు, స్థానిక సిబ్బంది కలిసి గస్తీ ఉన్నారు. కాగా కూపన్లు అయిపోయినప్పటికీ జనాల రద్దీ తగ్గలేదు. పోలీసులు వీరిని బయటకు పంపేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.