విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు పదవ తరగతి బాలుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఒక్కరు కాదు ఏకంగా నలుగురు కలిసి ఆ మైనర్ బాలుడిని తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చింది. ఈ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. చాలా రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
Also Read: Red Rice Benefits: రెడ్ రైస్ ను రోజూ ఒక కప్పు తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో.. ఆ సమస్యలకు చెక్..
వివరాల ప్రకారం ఢిల్లీలోని యమునా విహార్ ప్రాంతంలో 10వ తరగతి చదువుతున్న బాలుడు తరగతి టీచర్ పాఠాలు చెబుతుండగా తరగతి గది కిటికీలోంచి బయటకు చూశాడు. దీంతో టీచర్ వచ్చి తనని చెంప దెబ్బ కొట్టాడు. నొప్పిగా ఉంది అంటే మరో మూడు నాలుగు చెంప దెబ్బలు వరుసగా కొట్టాడు. తరువాత తానే వెళ్లి ఉపాధ్యాయుడికి సారీ చెప్పానని ఆ విద్యార్ధి తెలిపాడు. తనని కొట్టాడమే కాకుండా తరగతి గది నుంచి గంటేశారని ఆ విద్యార్థి తెలిపాడు. తర్వాత తనను ఎన్సీసీ గదికి తీసుకెళ్లాడనీ, అదే పాఠశాలలో పని చేస్తున్న అతని ముగ్గురు స్నేహితులతో కలిసి తీవ్రంగా కొట్టారని విద్యార్థి తెలిపాడు. అయితే తనని ఎందుకు కొట్టారో తెలియదని అతను పేర్కొంటున్నాడు.
ఈ దాడిలో తన నడుము, ఛాతీలో గాయాలు అయ్యాయనీ, ముఖం ఉబ్బిందని చెప్పుకొచ్చాడు ఆ విద్యార్థి. తనని కొట్టడమే కాకుండా ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారని విద్యార్థి వాపోయాడు. అయితే తాను జరిగిన విషయాన్నంత తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించాడు. ఈ దాడికి సంబంధించి ఈశాన్య ఢిల్లీలోని భజన్ పురా పోలీస్ స్టేషన్ లో నలుగురు ఉపాధ్యాయులపై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. అసలేం జరిగిందో కనుక్కొని చర్యలు తీసుకుంటామని పోలీసుల తెలుపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు నలుగురు ఇలా చేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పేద విద్యార్థులను స్కూల్ కు పంపిస్తే వారిని ఇలా హింసిస్తారా అంటూ మండిపడుతున్నారు.