NTV Telugu Site icon

Meghasandesam Movie 40 Years:నలభై ఏళ్ళ ‘మేఘసందేశం’

Meghasandesham

Meghasandesham

forty years for megha sandesham movie

నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు వీరాభిమాని దర్శకరత్న దాసరి నారాయణరావు. వీరి కాంబినేషన్ లో రూపొందిన చిత్రాలలో “ఏడంతస్తుల మేడ, శ్రీవారి ముచ్చట్లు, ప్రేమాభిషేకం, బహుదూరపు బాటసారి, బంగారు కుటుంబం” వంటి చిత్రాలు విజయం సాధించాయి. అన్నిటినీ మించి ‘ప్రేమాభిషేకం’ చరిత్ర సృష్టించే ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత నుంచీ ఏయన్నార్, దాసరి కాంబోలో వచ్చిన చిత్రాలపై ప్రేక్షకుల్లో భలే ఆసక్తి ఉండేది. అక్కినేని 200వ చిత్రంగా ‘మేఘసందేశం’ చిత్రాన్ని దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించడం విశేషం! ఈ సినిమా 1982 సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాసరి పద్మ సమర్పణలో తారకప్రభు ఫిలిమ్స్ పతాకంపై ‘మేఘసందేశం’ రూపొందింది.

‘మేఘసందేశం’ కథ ఏమిటంటే – ప్రకృతిని చూస్తే పరవశించిపోయే కవి రవీంద్రబాబు. ఆయనకు కళలంటే ఎంతో అభిమానం. పార్వతి ఆయన భార్య. వారికి ఓ కూతురు ఉంటుంది. తన ఊరిలో రవీంద్రబాబు నిజాయితీ పరునిగా, మంచివాడిగా పేరు సంపాదించి ఉంటాడు. ఆయన మాటకు ఊరి జనం కూడా విలువనిస్తూ ఉంటారు. ఆ ఊరిలో ఏటి ఒడ్డున ఓ కళావంతుల కుటుంబం వచ్చి ఉంటుంది. అందులో పద్మ, ఆమె సోదరి కలసి తమ నృత్యంతో ఊరి జనాన్ని ఆకర్షిస్తూ ఉంటారు. అక్కడకు వెళ్తూ తమ మొగుళ్ళు కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని ఎంతోమంది ఆడవాళ్ళు వాపోతుంటారు. ఇది తెలిసిన రవీంద్రబాబు ఆ ఒడ్డుకు వెళ్ళి ఆ కళావంతుల ఆట చూసేవారిని మందలిస్తాడు. ఓ సారి ఆ కళాకారుల నృత్యగీతాలు విని రవీంద్రబాబు కూడా పరవశించి పోతాడు. ఊరందరికీ బుద్ధి చెప్పిన రవీంద్రబాబు, పద్మ నాట్యానికి ఆకర్షితుడవుతాడు. తన కవితకు తగ్గ నాట్యం చేసే పద్మతోనే జీవితంగా మారిపోతాడు. ఈ విషయం పార్వతికి తెలుస్తుంది. తన అన్నయ్య జగన్నాథానికి చెబుతుంది. అది తెలిసి జగన్నాథం, పద్మను హెచ్చరిస్తాడు. అది రవీంద్రబాబుకు తెలుస్తుంది. బాధపడతాడు. తరువాత పద్మ కనిపించక ఆమె కోసం మేఘాలతో సందేశం పంపుతూ కవితలు రాస్తూ తిరుగుతాడు. పద్మ ఊరొదిలి వేరే ఊరికి మకాం మారుస్తుంది. ఆమెను వెదుకుతూ వెళ్ళిన రవీంద్రబాబు, ఆమెతోనే వెళ్ళాడని ఊరిజనం అనుకుంటూ ఉంటారు. పద్మ నాట్య ప్రదర్శన వద్ద రవీంద్ర ఆమెను కలుసుకుంటాడు. రవీంద్ర కూతురు పెళ్ళికి రమ్మని జగన్నాథం, ఆ ఊరి పెద్దలు పిలవడానికి వస్తారు. రాలేనంటాడు. వస్తే తన కూతురికే పరువు తక్కువ అనీ చెబుతాడు. కానీ, పద్మనే నచ్చచెప్పి పంపిస్తుంది. పెళ్ళయ్యాక కూతురు వెళ్ళవద్దని రవీంద్రను కోరుతుంది. తాను చేసిన పాపానికి, భార్యను క్షమాపణ కోరతాడు రవీంద్ర. ఆయన మనసు పద్మ దగ్గరే ఉంది అక్కడికి తీసుకువెళ్తేనే మంచిదని పార్వతి అంటుంది. కానీ, ఆలోగా ఆయన ప్రాణం విడుస్తాడు. పద్మకు ఈ విషయం చెప్పాలా, ఆమెను తీసుకు రావాలా వద్దా అనే అంశంపై చర్చ సాగుతుంది. పార్వతి తన అన్నను పిలిచి, పద్మను తీసుకు రమ్మంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే పద్మ చనిపోయి ఉంటుంది. రవీంద్ర, పద్మ ఇద్దరికీ ఒకే చోట అంత్యక్రియలు జరగడంతో కథ ముగుస్తుంది.

ఏయన్నార్, జయసుధ, జయప్రద, జగ్గయ్య, సుభాషిణి, శ్రీగంగ, బేబీ అనిత, వై.ఎస్.లక్ష్మి, రాజ్యలక్ష్మి, రాంబాబు, రాజబాబు, అట్లూరి బలరామ్, బౌనా ముఖ్యపాత్రధారులు కాగా, “పాడనా వాణి కళ్యాణిగా…” అంటూ సాగే పాటలో ప్రఖ్యాత గాయకులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాట పాడుతూ కనిపించారు. రమేశ్ నాయుడు స్వరకల్పన చేసిన ఈ చిత్రంలో అనువైన చోట జయదేవుని అష్టపదులు ఉపయోగించుకోగా, దేవులపల్లి, వేటూరి పాటలు రాశారు. పాలగుమ్మి పద్మరాజు పద్యాలను వినియోగించుకున్నారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం దాసరి నారాయణరావు నిర్వహించారు. “ఆకాశ దేశానా… ఆషాఢమాసాన…”, “నవరస సుమమాలిక…”, “నిన్నటిదాకా శిలనైనా…”, “పాడనా వాణి కళ్యాణిగా…” అంటూ సాగే పాటలను వేటూరి కలం పలికించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన “ఆకులో ఆకునై…”, “ముందు తెలిసెనా ప్రభూ…”, “సిగలో అవి విరులో…”, “సీతవేళ రానీయకు…” అనే పాటలూ చోటు చేసుకున్నాయి. జయదేవుని “ప్రియే చారుశీలే…” అనే అష్టపది సైతం అలరించింది.

ఈ చిత్ర కథ వి.శాంతారామ్ తెరకెక్కించిన ‘పింజ్రా’ను పోలి ఉంటుంది. దానికే కొన్ని మార్పులూ చేర్పులూ చేసి ‘మేఘసందేశం’ రూపొందించారు. ‘మేఘసందేశం’ పాటలతో పరవశింప చేసింది. కానీ, ఆర్థిక విజయం సాధించలేకపోయింది. ఈ చిత్రానికి పలు జాతీయ, రాష్ట్ర బహుమతులు లభించాయి.
ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ సంగీత దర్శకుడుగా రమేశ్ నాయుడు, ఉత్తమగాయకునిగా ఏసుదాస్, ఉత్తమగాయనిగా పి.సుశీల నేషనల్ అవార్డులు సొంతం చేసుకున్నారు.
అంతకు ముందు ‘నంది’ అవార్డుల్లో ఉత్తమ నటుడు కేటగిరీ అనే విభాగాన్ని 1977లో ప్రారంభించారు. ‘అమరదీపం’ చిత్రం ద్వారా కృష్ణంరాజు నంది అందుకున్న తొలి ఉత్తమనటుడుగా నిలిచారు. అయితే అవార్డులు కూడా హీరోలకేనా అనే విమర్శలు వినిపించాయి. దాంతో తరువాత కేరెక్టర్ యాక్టర్స్ కు ఉత్తమ నటులుగా నంది అవార్డులు ఇస్తూ వచ్చారు. ఈ సినిమా 1982లో విడుదల కాగా, 1983లో యన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో ఆయన హయాములోనే నంది అవార్డులు ప్రదానం చేశారు. హీరోలు కూడా నటులే కదా అన్న భావనతో ఈ సినిమాతో ఏయన్నార్ కు ఉత్తమ నటునిగా నంది అవార్డును ఇచ్చారు. అప్పటి నుంచే హీరోలకు కూడా నంది అవార్డుల్లో ఉత్తమ నటులుగా బహుమతులు రాసాగాయి.

నంది అవార్డుల్లో మేఘసందేశం చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు రాగా, ఉత్తమ నటుడుగా ఏయన్నార్, ఉత్తమ నటిగా జయసుధ, ఉత్తమ సంగీత దర్శకుడుగా రమేశ్ నాయుడు, ఉత్తమ గీత రచయితగా దేవులపల్లి, ఉత్తమ నేపథ్యగాయకుడుగా ఏసుదాస్, ఉత్తమ గాయనిగా పి.సుశీల, ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా ఎ.ఆర్.స్వామినాథన్, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా సెల్వరాజ్ అవార్డులు అందుకున్నారు. ఇలా అవార్డులనైతే బాగానే సంపాదించిన ‘మేఘసందేశం’ ప్రేక్షకుల రివార్డును అందుకోలేక పోయింది.

 

 

 

 

Show comments