Kalamata Venkataramana: పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తన రాజకీయ భవిష్యత్తుపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. నేను స్వచ్ఛందంగా వదిలింది కేవలం పార్టీ అధ్యక్ష పదవినే తప్ప.. పార్టీని కానీ, రాజకీయాలను కానీ కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనపై గత ఎన్నికల సమయంలో జరిగిన కుట్ర తరహాలోనే మరో కుట్ర జరుగుతోందేమో అన్న అనుమానం కలుగుతోందని వెల్లడించారు. అయితే, ఇలాంటి ప్రయత్నాలు తన రాజకీయ ప్రయాణాన్ని ఆపలేవని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీని కలిసిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలు..
గత 60 ఏళ్లుగా పాతపట్నం రాజకీయాల్లో కలమట కుటుంబానికి ఒక ప్రత్యేక బ్రాండ్ ఉందని, ప్రజలతో తమ కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందని ఆయన గుర్తుచేశారు. ప్రజల కష్టసుఖాల్లో తాము, తమ కష్టసుఖాల్లో ప్రజలు భాగస్వాములుగా నిలుస్తూ పరస్పర విశ్వాసంతో ప్రయాణం కొనసాగిస్తున్నామని తెలిపారు. గత ఎన్నికల్లో అనివార్య, అనూహ్య కారణాల వల్ల టికెట్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని వెల్లడించిన వెంకటరమణ.. రానున్న రోజుల్లో పార్టీ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని, నియోజకవర్గంలో తమ స్థానాన్ని ఎప్పటిలానే తిరిగి సాధించేందుకు స్పష్టమైన ఆలోచనలు, కార్యాచరణ తమ వద్ద ఉన్నాయని చెప్పారు. త్వరలోనే పాతపట్నం ప్రజలకు గతంలో మాదిరిగానే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. రాజకీయాల్లో తన దూకుడును, సేవాభావాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని అన్నారు. చివరిగా ఆయన తన రాజకీయ నిర్ణయంపై మరోసారి క్లారిటీ ఇస్తూ, “పార్టీ అధ్యక్ష పదవిని మాత్రమే వదిలా తప్ప.. పార్టీని కాదు, రాజకీయాలను అంతకన్నా కాదు. ఈ విషయం తెలుసుకోవాల్సిన వాళ్లు తెలుసుకోవాలి” అంటూ మాస్ టోన్‌లో హెచ్చరిక చేశారు.
