Vadde Shobhanadreeswara Rao: అమరావతిలో రెండో విడత భూ సమీకరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి వడ్డే వడ్డే శోభనాద్రీశ్వర రావు.. అమరావతి రెండో విడత భూ సమీకరణపై రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో విజయవాడలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు, సీపీఎం నేత బాబురావు, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, సీపీఐ నేత వనజ పాల్గొన్నారు. ఈ సమావేశంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రభుత్వం ముందుగా మొదటి విడతలో తీసుకున్న భూములపై ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. 16 వేల ఎకరాలు అదనంగా తీసుకోవాలన్న నిర్ణయం ఆలోచనారాహిత్యంగా ఉంది అన్నారు. సింగపూర్ తయారు చేసిన మాస్టర్ ప్లాన్‌లో లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. అమరావతి భవిష్యత్ GDP ₹3 లక్షల కోట్లు అవుతుందని సింగపూర్ తెలిపిందేమో గానీ, ఆ అంచనాపై ప్రభుత్వం ఎప్పుడూ విమర్శనాత్మకంగా ఆలోచించలేదని విమర్శించారు..
Read Also: Palnadu Crime: పల్నాడులో తల్లీకొడుకుల మృతి కలకలం.. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరణ..?
పచ్చని పంట భూముల నాశనం.. రైతుల నమ్మకం భంగం
అమరావతిలో సంపన్నమైన వ్యవసాయ భూములు నాశనం అయ్యాయని, రైతులు ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చినప్పటికీ వారి ప్రయోజనాలను కాపాడే బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించలేదని తీవ్ర విమర్శలు చేశారు వడ్డే.. మూడు ఏళ్లలో మౌలిక సదుపాయాలు అందిస్తామని అగ్రిమెంట్ చేసినా, ఇప్పటివరకు అవి అమలు కాలేదని అన్నారు. 2 వేల మందికి పైగా రైతులు ఇంకా ఫ్లాట్లు కూడా పొందలేదని పేర్కొన్నారు. కొందరికి ఇచ్చిన ఫ్లాట్లకు వెళ్లడానికి దారి కూడా లేదని విమర్శించారు.
రాజధాని రైతులపై కేసులు ఎందుకు నిలిచిపోతున్నాయి?
రాజధాని రైతులపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఇంకా తొలగించలేదని, ఇదే సమయంలో గత ప్రభుత్వంలో జరిగిన ఘటనలు అయితే వెంటనే కేసులు తీసేసిన ఉదాహరణలను గుర్తు చేశారు వడ్డే శోభనాద్రీశ్వర రావు.. “ఐకానిక్ టవర్లు”– “గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్”– “ఒలింపిక్ సిటీ” : కేవలం కలలేనా? అని ప్రశ్నించారు.. అమరావతిలో 2 లక్షల జనాభా కూడా లేకపోయినా, 1000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ నిర్మిస్తామని చెప్పడం అభ్యంతరకరమన్నారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు 2500 ఎకరాలు కావాలని చెప్పి ఇప్పుడు 5000 ఎకరాలు కావాలనడం అసంబద్ధమన్నారు. నవ నగరాల్లో ఇప్పటికే 4000 ఎకరాలు కేటాయించి మళ్లీ పరిశ్రమల పేరుతో ఉన్న భూములను తీసుకోవడం ప్రజలకు భారమని అన్నారు. ఒలింపిక్ క్రీడల నిర్వహణ కోసం మరో 4000 ఎకరాలు కావాలని చెప్పడం ప్రజల డబ్బుతో ‘పగటి కలలు’ కంటున్నట్టేనన్నారు అని మండిపడ్డారు..
“పొరపాట్లు జరుగుతున్నాయి… సీఎం గుర్తించాలి”
అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు. కానీ, అమలు ప్రక్రియలో పెద్దపెద్ద పొరపాట్లు జరుగుతున్నాయి” అని మాజీ మంత్రి పేర్కొన్నారు. ముందుగా మొదటి విడత హామీలను అమలు చేయాలి. తర్వాతే రెండో విడత భూ సమీకరణపై ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవాలి. లేకపోతే లక్షలాది మంది ప్రజలు నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు.
