NTV Telugu Site icon

Hemant Soren: ఈడీ అరెస్టును సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఝార్ఖండ్ మాజీ సీఎం!

Supreme Court

Supreme Court

Hemant Soren Approaches Supreme Court Against ED Arrest: భూ కుంభకోణం కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ.. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈడీ అరెస్టును సవాలు చేస్తూ.. గురువారం హేమంత్ సోరెన్ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అంగీకరించారు. అత్యవసర విచారణ కోసం భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీలు సోరెన్ విషయాన్ని ప్రస్తావించారు.

భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. హేమంత్ సోరెన్ అరెస్టుకు వ్యతిరేకంగా గురువారం రాష్ట్రంలో బంద్ పాటించనున్నట్లు గిరిజన సంస్థలు ప్రకటించాయి. మరోవైపు శాసనసభా పక్ష నేతగా చంపై సోరెన్ ఎన్నికయ్యారు. అనంతరం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదనను ఆయన సమర్పించారు. జార్ఖండ్ తదుపరి సీఎం చంపై సోరెన్‌ అంటూ వార్తలు వస్తున్నాయి.

Also Read: IND vs ENG: విశాఖలో రోహిత్ శర్మ రికార్డులు అదుర్స్.. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలే!

ఇక ఈడీ అరెస్టుకు ముందు జార్ఖండ్ రాష్ట్ర ప్రజలు, పార్టీ నేతలను ఉద్దేశించి హేమంత్ సోరెన్‌ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈడీ తనను అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోందని, దానికి తానేమీ బాధపడటం లేదన్నారు. రోజంతా ప్రశ్నించిన తర్వాత తనకు సంబంధంలేని కేసులో అధికారులు అరెస్టు చేయాలనే నిర్ణయానికి వచ్చారని పేర్కొన్నారు. ఈడీ ఎలాంటి ఆధారాలను గుర్తించలేదని, ఢిల్లీలోని నివాసంలో సోదాలు నిర్వహించి తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు యత్నించారన్నారు. పేదలు, ఆదివాసీలు, దళితులు, అమాయక ప్రజలపై అరాచకాలకు పాల్పడే వారిపై సరికొత్త పోరాటం చేయాల్సి ఉందని సోరెన్‌ వీడియోలో చెప్పారు.