Mithali Raj: భారత మహిళా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తన వ్యక్తిగత జీవితం, పెళ్లికి సంబంధించిన విషయాలపై ఆసక్తికరమైన విషయాలను తాజాగా NTV పాడ్‌కాస్ట్ లో పంచుకున్నారు. సుదీర్ఘమైన 23 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానంలో ఆట పట్ల చూపిన అంకితభావం వల్ల వ్యక్తిగత జీవితం వెనకబడిందని, అయితే భవిష్యత్తులో సరైన వ్యక్తి తారసపడితే వివాహం గురించి తప్పకుండా ఆలోచిస్తానని ఆమె స్పష్టం చేశారు.
ఆటకు ఇచ్చిన ప్రాధాన్యత మరేదానికీ ఇవ్వలేదు..
పాడ్‌కాస్ట్ లో మిథాలీ మాట్లాడుతూ.. “నా తొమ్మిదేళ్ల వయసు నుంచి 2022లో రిటైర్మెంట్ ప్రకటించే వరకు దాదాపు 23 ఏళ్ల పాటు నా జీవితం పూర్తిగా క్రికెట్‌కే అంకితమైంది. ఈ ప్రయాణంలో నేను ఆటకు ఇచ్చినంత నిబద్ధతను ఒక కూతురిగా, సోదరిగా లేదా స్నేహితురాలిగా నా వ్యక్తిగత సంబంధాలకు కూడా ఇవ్వలేకపోయాను. నా పూర్తి సమయం, ఆలోచనలు కేవలం ఆటకు మాత్రమే పరిమితమయ్యాయి” అని ఆమె చెప్పుకొచ్చారు.
పెళ్లిపై అభిప్రాయం..
ప్రస్తుత రోజుల్లో ఒంటరిగా ఉంటూ తమకిష్టమైన రంగాల్లో రాణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని పేర్కొన్న మిథాలీ, పెళ్లి విషయంలో తన దృక్పథాన్ని కూడా చెప్పుకొచ్చారు. “నాకంటూ సరైన వ్యక్తి దొరికితే ఖచ్చితంగా వివాహం గురించి ఆలోచిస్తానని.. ఏదైనా సహజంగా, ఆర్గానిక్‌గా జరిగితే దానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను” అని చెప్పుకొచ్చారు. మహిళా అథ్లెట్లు సహజంగానే స్వావలంబన (self-sufficient) కలిగి ఉంటారు. తమ లైఫ్‌స్టైల్‌ను, స్వతంత్రతను అర్థం చేసుకునే భాగస్వామిని కోరుకుంటారు. ప్రస్తుతం నాకు లభిస్తున్న స్వేచ్ఛ, కుటుంబంతో గడిపే సమయం పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నానని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుత జీవితం ఎంతో సంతృప్తికరం..
ప్రస్తుతం తన సమయాన్ని తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడానికి, క్రికెట్ అసోసియేషన్ సంబంధిత బాధ్యతలకు ఇంకా యువ క్రీడాకారిణులకు మార్గదర్శకత్వం అందించడానికి వెచ్చిస్తున్నానని తెలిపారు. జీవితంలో దేన్నీ కోల్పోయాననే భావన తనకు లేదని, తనకున్న స్వేచ్ఛతో ప్రస్తుత జీవితాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నానని మిథాలీ రాజ్ పేర్కొన్నారు.

