Former Gujarat Minister: గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలోని సావర్‌కుండ్లా పట్టణం సమీపంలో ఆయన నడుపుతున్న కారు బుల్‌డోజర్‌ను ఢీకొనడంతో గుజరాత్ మాజీ వ్యవసాయ మంత్రి వల్లభ్‌భాయ్ వాఘాసియా మరణించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ ప్రమాదం గురువారం రాత్రి జరిగినట్లు వంద పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. సావర్కుండ్లా అసెంబ్లీ స్థానం నుండి మాజీ ఎమ్మెల్యే వఘాసియా(69), విజయ్ రూపానీ ప్రభుత్వం మొదటి టర్మ్‌లో వ్యవసాయం, పట్టణ గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు.
ఆయన ఓ గ్రామం నుంచి సావర్కుండ్లకు తిరిగి వస్తుండగా వంద గ్రామ సమీపంలోని రాష్ట్ర రహదారిపై రాత్రి 8.30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఆయనతో పాటు వాహనంలో ఉన్న ఒకరికి గాయాలయ్యాయని పోలీసు అధికారి తెలిపారు. మాజీ మంత్రి ప్రయాణిస్తున్న కారు బుల్‌డోజర్‌ను ఢీకొనడంతో గాయపడ్డారు. ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పార్టీ నాయకులు, ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
Read Also: Earthquake: వనాటు సమీపంలో 7.7 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
“సావరకుండ్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వీవీ వాఘాసియా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.. నైపుణ్యం కలిగిన ఆర్గనైజర్‌గా, మాస్ లీడర్‌గా పనిచేసి అమ్రేలి ప్రజలకు సేవ చేసిన ఆ నాయకుడు మన మధ్య లేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.’ అని సావర్‌కుండ్ల బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మహేశ్ కస్వాలా అన్నారు. అమ్రేలి ఎమ్మెల్యే కౌశిక్ వెకారియ మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం వాఘాసియా చేసిన నిబద్ధత చిరస్మరణీయమని అన్నారు. వాఘసియా 2012 అసెంబ్లీ ఎన్నికల్లో సావర్కుండ్లా స్థానం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2016లో విజయ్ రూపానీ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.