కాకినాడ జిల్లాలో పులి సంచారం అక్కడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. గత నెల రోజులుగా పులి సంచారం గ్రామస్థులకు, అటవీశాఖ సిబ్బందికి కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. నిన్న జిల్లాలోని రౌతులపూడి మండలంలో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు వెల్లడించడంతో అటవీ అధికారులు, సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. రౌతులపూడి మండలం అటవీ ప్రాంతంలో పులి ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో ఫారెస్ట్, వన్యప్రాణి, ఎన్‌ఎస్‌టీఆర్‌సిబ్బంది అప్రమత్తమైంది.
అయితే.. నిర్దిష్టమైన ప్రదేశంలో ఉందని అంచనాకి వస్తే గాని ట్రాంక్విలైజ్ గన్ తో షూట్ చేసి స్పృహ కోల్పోయేలా చేయలేమని మహారాష్ట్ర తడోబా నుంచి వచ్చిన ఫారెస్ట్ అధికారులు చెప్తుతున్నారు. ఇప్పటివరకు నాలుగు మండలాల్లో 33 గ్రామాల్లో పులి సంచరించింది. నెల రోజుల పాటు 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కారిడార్ ఏర్పాటు చేసుకుంది. పులి దిశ ఇలాగే ఉంటే సార్లంక అభయారణ్యం మీదుగా అనకాపల్లి జిల్లాలోని అటవీ ప్రాంతానికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.