భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఫారెస్ట్ అధికారులు అమానుష చర్యకు పాల్పడ్డారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల పట్ల కర్కశంగా వ్యవహరించారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే.. లక్షలు వెచ్చించి మోటారు బోర్లు తవ్వుకున్న రైతులకు తీరని నష్టాన్ని కలిగించారు. చర్ల మండలం పులిగుండాల గ్రామంలో ఫారెస్ట్ అధికారులు మోటారు బోరులో రాళ్లు వేశారు. మీడియం లక్ష్మీ అనే గిరిజన మహిళ రైతు పంట పొలంలో వేసిన మోటారు బోరులో ఫారెస్ట్ బీట్ అధికారి రాళ్ళు వేశాడు. ఐటిడి పిఓ, జిల్లా కలెక్టర్ల అనుమతులు ఉన్నప్పటికీ బోర్లను తొలగించారు అటవీ శాఖ అధికారులు. అధికారుల తీరుపై రైతులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:Rajamouli : రాజమౌళి రెమ్యునరేషన్ రూ.200 కోట్లు.. IMDB నివేదిక..
అటవీ శాఖ అమానుష చర్యలను నిరసిస్తూ భద్రాచలం చర్ల ప్రధాన రహదారిపై పులిగుండాల గ్రామస్తుల రాస్తారోకో నిర్వహించారు. దీంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య సంఘటన స్థలానికి చేరుకొని ఈ ఘటనకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రెండు కిలోమీటర్ల మేర ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు వాహనదారులు. ఘటన స్థలానికి చేరుకున్న చర్ల సీఐ రాజు వర్మ, ఎస్ఐలు ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.
