Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు

Flydubai (1)

Flydubai (1)

Flydubai Co-Pilot Hamam Al-Hammami: దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేసేందుకు యత్నించి, కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడికి దిగిన కో-పైలట్‌కు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సౌదీ వార్తా సంస్థ అల్ అరేబియా కథనం ప్రకారం.. ఈ కో-పైలట్ ఒమాన్ జాతీయుడైన హమామ్ అల్-హమ్మమీగా గుర్తించారు. అయితే అతని ఐడియాలాజికల్ (భావజాల) ఆలోచనలపై అనుమానాలు ఉండటంతో, అతడిని గతంలోనే ఒమాన్‌లో విమానాలు నడపకుండా నిషేధించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. భద్రతా ముప్పుగా భావించి గతంలోనే ఒమాన్ ఎయిర్ అతడిని సస్పెండ్ చేసిందని ఏబీసీ న్యూస్ వెల్లడించింది. అయితే, అల్-హమ్మమీ గురించిన భయాలు, అనుమానాలను ఒమాన్ ప్రభుత్వం ఇతర దేశాలతో గానీ, వేరే ఎయిర్‌లైన్స్ సంస్థలతో గానీ పంచుకుందో లేదో స్పష్టంగా తెలియడం లేదు. అలాగే అతడు ఎలా, ఎంతవరకు తీవ్రవాద సిద్ధాంతాలకు ప్రభావితమయ్యాడనేది ఇంకా పూర్తిగా తేలలేదు. కానీ, దర్యాప్తు సంస్థల విచారణలో మాత్రం ఆ విమానాన్ని ఇజ్రాయెల్‌లోనే కూల్చేయాలని తాను భావించినట్లు కో-పైలట్ చెప్పినట్లు ఓ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

ఇక, సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్ ఫ్లైట్ 1073 విమానంలో ఈ దారుణ సంఘటన జరిగింది. సుమారు 170 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది ఉన్న ఆ విమానంలో కో-పైలట్ అలజడి సృష్టించాడు. కాకపోతే, అదే విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆఫ్-డ్యూటీ ఫ్లైదుబాయ్ పైలట్లు వెంటనే సమయస్ఫూర్తితో స్పందించారు. అల్లరి చేస్తున్న కో-పైలట్‌ను అదుపులోకి తీసుకుని, విమాన నియంత్రణను తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు. ఆ తర్వాత విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్‌‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో ఇద్దరు పైలట్లు గాయపడటం, కో-పైలట్‌ను సీటుకు కట్టేసి ఉంచడాన్ని రాయిటర్స్ పరిశీలించిన వీడియోలు ధృవీకరించాయి.

మరోవైపు, ఈ ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆ కో-పైలట్ ఇస్లామిక్ తీవ్రవాద సిద్ధాంతాలకు లోనయ్యాడని, ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటాడని అన్నారు. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలను ఆయన బయటపెట్టలేదు. “అతడిని వెనుకుండి ఎవరైనా నడిపించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం, ఒకవేళ అది నిజమని తేలితే బాధ్యులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు” అని నెతన్యాహు హెచ్చరించారు. కానీ, ఇజ్రాయెల్ భద్రతా అధికారులు మాత్రం ఆ పైలట్ ఎవరి సాయం లేకుండా ఒంటరిగానే ఈ పని చేసి ఉంటాడని భావిస్తున్నారు. విచారణ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేశారు. అలాగే యూఏఈలోని ఇజ్రాయెల్ రాయబారి మాట్లాడుతూ.. ఈ దాడి వెనుక అసలు ఉద్దేశం ఏంటనేది ఇంకా పూర్తిగా తేలలేదని చెప్పారు. ఇక ఈ తీవ్రమైన ఆరోపణలపై ఒమాన్ అధికారులు కానీ, ఆ కో-పైలట్ ప్రతినిధులు కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఈ ఘటనతో ఏవియేషన్ రంగానికి చెందిన భద్రతా వ్యవస్థలు, ముఖ్యంగా ఇజ్రాయెల్‌‌కు వెళ్లే విమానాల సిబ్బందిని స్క్రీనింగ్ చేసే విధానాలపై మళ్లీ చర్చ మొదలైంది. టెల్ అవీవ్‌కు వెళ్లే విమానాన్ని ఒమాన్ పైలట్ నడిపేలా చేసిన భద్రతా లోపాలపై సమీక్ష జరుపుతామని నెతన్యాహు వెల్లడించారు. ఈ ఘటనపై విమానం రిజిస్టర్ అయిన యూఏఈ పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతుండగా, విమానం అత్యవసరంగా దిగిన సౌదీ అరేబియా ప్రాథమిక విచారణను పూర్తి చేసింది. మరోవైపు ఈ సమగ్ర దర్యాప్తులో భాగస్వామ్యమవుతామని ఇజ్రాయెల్ సూచించింది. ఇక ఈ మొత్తం ఉదంతంపై విచారణ వేగవంతం చేసినట్లు ఫ్లైదుబాయ్ సంస్థ ప్రకటించింది.