Flood Rising in Godavari: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి, దాని ఉప నదులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువన గోదావరిలోకి ప్రవాహాలు పెరుగుతుండగా.. కాళేశ్వరం దిగువన ప్రాణహిత, ఇంద్రావతి ఉప నదులు, వాగుల నీటి చేరికతో నది ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో మేడిగడ్డ దగగ్ర వచ్చిన నీటిని వచ్చినట్లే కిందకు వదులుతున్నారు. గురువారం మధ్యాహ్నమే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దీంతో నది తీర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రా లకు తరలిస్తున్నారు. భద్రాచలం నుంచి పోలవరం ప్రాజెక్టులోకి గోదా వరి ప్రవాహం పెరిగింది. ధవళేశ్వరం దగ్గర గోదావరికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. అయితే, ఐఎండీ అంచనాల ప్రకారం ఎగువ ఉన్న గోదావరి పరివాహక రాష్ట్రాల్లో మరో రెండు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి రేపు భద్రాచలం వద్ద వరద ప్రవాహం హెచ్చుతగ్గులుగా ఉన్నప్పటికీ ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.
శుక్రవారం రాత్రి 9 గంటలకు ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.73 లక్షల క్యూసెక్కులు ఉందని శనివారం నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నందని అన్నారు అంబేద్కర్.. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేస్తున్నామన్నారు. మొదటి హెచ్చరిక వస్తే ప్రభావితం చూపే 42 మండలాల జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చెప్పారు. అత్యవసర సహాయక చర్యల కోసం మొత్తం మూడు బృందాలు సిద్ధంగా ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం, ఏలూరు జిల్లా కుకునూర్ , వేలేర్పాడులో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నట్లు చెప్పారు. ఈ బృందాలు ఓబియమ్ బోట్స్, లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్, రోప్స్, ఆస్కా లైట్ ఇతర రక్షణా పరికరాలతో సిద్ధంగా ఉన్నాయన్నారు. సెంట్రల్ వాటర్ కమీషన్ అంచనా ప్రకారం ఆదివారం నుంచి వరద ఉధృతి క్రమంగా పెరిగే అవకాశం ఉందన్నారు. బుధ, గురువారాల వరకు వరద ప్రభావం చూపనున్నట్లు వెల్లడించారు. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.