Site icon NTV Telugu

Flipkart GOAT sale Scam: ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌ను టార్గెట్ చేసుకున్న స్కామర్లు.. నకిలీ కస్టమర్ సపోర్ట్, క్లోన్ వెబ్‌సైట్లతో వల..!

Flipkart

Flipkart

Flipkart GOAT sale Scam: జూలై 17వ తేదీ వరకు కొనసాగనున్న ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ మరోసారి సైబర్ మోసగాళ్లకు అడ్డగా మారింది. గత ఏడాది మాదిరిగానే.. ఈసారి కూడా డూప్లికేట్ వెబ్‌సైట్లు, నకిలీ కస్టమర్ సపోర్ట్ ఖాతాలు, ఫిషింగ్ లింకులు వంటివి పుట్టుకొచ్చాయి. వీటితో వినియోగదారులను మోసం చేసి వారి ప్రైవేట్ డేటా, డబ్బులను దొంగలిస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఓ నివేదిక ప్రకారం.. కనీసం పదికి పైగా నకిలీ వెబ్‌సైట్లు, ఫిషింగ్ లింకులు గుర్తించబడ్డాయి.

Read Also:Mumbai Airport: తప్పిన పెను ప్రమాదం.. విమానాన్ని ఢీ కొట్టిన కార్గో వాహనం..!

ఈ సైట్లు ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌ను అనుకరిస్తూ ఉండి.. flipkart.garud*.in**, flipkart.aditya**.com** లాంటి పేర్లతో కనిపిస్తున్నాయి. ఇవి ఐఫోన్లు, వన్‌ప్లస్ మొబైల్స్ రూ.1,000కంటే తక్కువ ధరకు, MacBook ఎయిర్ రూ.7,999కి, పురుషుల జాకెట్లు రూ.55కి, మహిళల జాకెట్లు రూ. 29కి అంటూ ఆకర్షణీయమైన ఆఫర్లు చూపిస్తున్నాయి. ఇవి మొత్తం అసలైన డిజైన్‌ను కాపీ చేసి, వినియోగదారులు సులభంగా నమ్మేలా రూపొందించబడ్డాయి. ఈ డూప్లికేట్ సైట్లు ఎక్కువగా GOAT సేల్ ప్రారంభానికి రెండు వారాల ముందు క్రియేట్ అయ్యాయి.

గత ఏడాది కూడా ఫ్లిప్‌కార్ట్ పేరుతో 3,000కిపైగా డొమెయిన్లు నమోదు అయ్యాయంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఇందులో కొన్ని flipkart[.]gift, flipkart[.]cricket, flipkart[.]desi, flipkart[.]delivery లాంటి డొమెయిన్ పేర్లతో ఉండగా.. 20 సైట్లు గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు రీడైరెక్ట్ అయినట్లు బయటపడింది. మోసాలు ఇక్కడితో ఆగకుండా.. సోషల్ మీడియాలో “Flipkart Customer Support” పేరుతో నకిలీ ఖాతాలు మొదలయ్యాయి. జూలై 2025లో సృష్టించబడిన ఈ ఖాతాలు ఫ్లిప్‌కార్ట్ లోగోను ప్రొఫైల్ పిక్చర్‌ గా పెట్టి, తమ ఫోన్ నంబర్లు పోస్ట్ చేస్తూ వినియోగదారులపై నమ్మకం కలిగించేలా వ్యవహరిస్తున్నాయి.

Read Also:Realme 15 Pro 5G: లాంచ్‌కు ముందే ఫీచర్స్ వెల్లడి.. 7,000mAh భారీ బ్యాటరీ, ఆకర్షణీయమైన డిస్ప్లే ఫీచర్లతో రాబోతున్న రియల్‌మీ 15 ప్రో..!

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఫ్లిప్‌కార్ట్ గతంలోనూ ఎన్నో హెచ్చరికలు, సూచనలు విడుదల చేసినప్పటికీ, స్కామర్లు మళ్లీ అదే పాత పద్దతులను ఉపయోగిస్తూ సేల్ సీజన్‌లో మోసాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి. ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్‌సైట్ (www.flipkart.com), యాప్‌ నుంచే మాత్రమే కొనుగోలు చేయాలి. ముఖ్యంగా నకిలీ ఆఫర్లు కనిపించిన వెంటనే దూరంగా ఉండాలి. ఫోన్, మెసేజ్, మెయిల్‌లో వచ్చిన అనుమానాస్పద లింకులను ఓపెన్ చేయవద్దు. ఇంకా అధికారిక ఫ్లిప్‌కార్ట్ సపోర్ట్ ఖాతా మాత్రమే నమ్మాలి.

Exit mobile version