Fire Accident: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలో మరోసారి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటికే సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదం నుంచి పూర్తిగా తేరుకోకముందే, తాజాగా మరో ప్రమాదం సంభవించడంతో స్థానికులు, కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం ఉదయం పాశమైలారంలోని ఎన్‌వీరో వెస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో అక్కడి సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు.
Read Also:Venkaih Naidu : గొప్ప మానవతా వాది.. ‘కోట’కు వెంకయ్య నాయుడు నివాళి
ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయా లేదా అనే విషయం ఇంకా స్పష్టతకు రాలేదు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం సంభవించిందన్న సమాచారం లేదు. వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు పరిశ్రమల భద్రతాపరమైన చర్యలపై అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. సంబంధిత అధికారులు సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
