Site icon NTV Telugu

Yash Dayal: ఆర్సీబీ బౌలర్‌ యష్ దయాళ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు.. శారీరకంగా వేధించాడంటూ..!

Yash Dayal

Yash Dayal

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ఫాస్ట్‌ బౌలర్‌ యశ్‌ దయాళ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి ఆరోపించారు. దయాళ్‌ తనను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దయాళ్‌తో తాను గత ఐదు ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు రాసుకొచ్చారు. ఈ మేరకు సదరు యువతి యూపీ సీఎం ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు.

యష్ దయాళ్‌కు అనేక మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని కూడా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను ప్రస్తుతం నిస్సహాయ స్థితిలో ఉన్నానని, న్యాయం కోసం నేరుగా సీఎంను వేడుకుంటున్నానని తెలిపారు. దయాళ్‌పై తన ఆరోపణలు వాస్తవం అని.. తన వద్ద చాట్‌, వీడియో కాల్స్‌కు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. దయాళ్‌తో మాట్లాడే ఓ అమ్మాయి తనకు ఫోన్ చేసిందని.. అతడు మోసగాడు అని, ఇతర అమ్మాయిలతో మాట్లాడుతున్నాడని ఎవిడెన్స్ ఇచ్చారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై యష్ దయాళ్‌ ఇప్పటివరకు స్పందించలేదు.

యష్ దయాళ్‌ 2024 నుండి ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులో భాగంగా ఉన్నాడు. 2025లో ఆర్సీబీ తన మొదటి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోవడంలో దయాళ్‌ ముఖ్యపాత్ర పోషించాడు. దయాళ్‌కు ఇది రెండవ ఐపీఎల్ టైటిల్. 2022లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్‌ టైటిల్ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. ఇప్పటివరకు 43 ఐపీఎల్ మ్యాచులు ఆడి 41 వికెట్స్ పడగొట్టాడు.

Exit mobile version