ఏపీలో సినీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని సినీ నటుడు భాను చందర్ అన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ పోరాటం చేస్తామని తెలిపారు. రాజమండ్రి శ్రీ వేంకటేశ్వర ఆనంకళాకేద్రంలో ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో.. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ నటుడు భాను చందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్ హామీ మేరకు సినీ కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం ఏర్పడిందని భాను చందర్ పేర్కొన్నారు.
Read Also: Vijayawada: ఎన్డీఆర్ఎఫ్ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం..
మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ.. సినీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక వినతిపత్రం ఇవ్వండని అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఏపీలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో అనేక సినీ చిత్రీకరణకు అనువైన ప్రదేశాలు ఉన్నాయని వివరించారు. ఇక్కడి షూటింగుల్లో స్థానిక కార్మికులకే ప్రాధాన్యం ఇచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయించే విషయాన్ని ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. టూరిజం అభివృద్ధిలో భాగంగా సినీ పరిశ్రమ కూడా ఏపీలో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. సినీ కార్మికుల పట్ల నిర్మాతలు చిన్న చూపు చూడటం కరెక్ట్ కాదని అన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రం టూరిజంలో కూడా వెనక్కి వెళ్ళిపోయిందని మంత్రి వ్యాఖ్యానించారు.
Read Also: Side Effects of Antibiotics: గుండె రోగులకు యాంటీబయాటిక్స్ సరైనవేనా?