FIFA World Cup 2026: అమెరికా గోల్స్ వర్షం.. పరాగ్వేపై 4-1 తేడాతో భారీ విజయం.!

Fifa World Cup 2026

Fifa World Cup 2026

FIFA World Cup 2026:ఫిఫా వరల్డ్‌కప్ 2026లో ఆతిథ్య జట్లలో ఒకటైన అమెరికా తన మొదటి మ్యాచ్ ను భారీ విజయంతో ప్రారంభించింది. లాస్ ఏంజెల్స్ స్టేడియంలో జరిగిన గ్రూప్-D మ్యాచ్‌ లో పరాగ్వేపై 4-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. అమెరికా స్టార్ ఫార్వర్డ్ ఫోలారిన్ బాలోగన్ రెండు గోల్స్ చేసి జట్టు విజయానికి ప్రధాన కారణమయ్యాడు.

మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన అమెరికా జట్టు 7వ నిమిషంలోనే ఆధిక్యంలోకి వెళ్లింది. క్రిస్టియన్ పులిసిక్ సృష్టించిన అవకాశాన్ని పరాగ్వే మిడ్‌ఫీల్డర్ డామియన్ బొబడిల్లా అనుకోకుండా సొంత గోల్‌ గా మార్చడంతో అమెరికా ఖాతా తెరిచింది. అనంతరం పులిసిక్ అద్భుత పాస్‌తో 31వ నిమిషంలో బాలోగన్ గోల్ చేసి స్కోరును 2-0కు చేర్చాడు. మొదటి అర్ధభాగం అదనపు సమయంలో మాలిక్ టిల్‌మన్ అందించిన అద్భుత లాంగ్ పాస్‌ను అందుకున్న బాలోగన్ మరోసారి గోల్ సాధించి అమెరికాకు 3-0 ఆధిక్యాన్ని అందించాడు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి అమెరికా పూర్తి ఆధిపత్యం చెలాయించింది.

×
×
Ad

రెండో అర్ధభాగంలో పరాగ్వే తరఫున మౌరిసియో ఓ గోల్ చేసి స్కోరును 3-1కు తగ్గించినా, అమెరికా ఆధిక్యాన్ని చెరిపేయలేకపోయింది. మ్యాచ్ చివరి క్షణాల్లో జియో రేయ్నా మరో గోల్ చేసి అమెరికా విజయాన్ని మరింత మెరుగ్గా మార్చాడు. దీంతో అమెరికా 4-1 తేడాతో విజయం నమోదు చేసింది. ఈ విజయంతో అమెరికా జట్టు వరల్డ్‌కప్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అంతేకాకుండా ఒక వరల్డ్‌కప్ మ్యాచ్‌లో నాలుగు గోల్స్ చేయడం అమెరికాకు ఇదే తొలిసారి. కొత్త కోచ్ మౌరిసియో పోచెట్టినో ఆధ్వర్యంలో జట్టు మరింత దూకుడైన ఆటతీరును ప్రదర్శించింది. ఇదిలా ఉండగా.. గ్రూప్-B మ్యాచ్‌లో కెనడా 1-1తో బోస్నియా అండ్ హెర్జెగోవినాతో డ్రా చేసుకుంది. కెనడా తరఫున సైల్ లారిన్ గోల్ సాధించాడు. వరల్డ్‌కప్ చరిత్రలో కెనడా చేసిన రెండో గోల్‌గా ఇది నిలిచింది.