గర్భధారణ అనగానే అందరి దృష్టి మహిళలపైనే పడుతుంది. ఆరోగ్యం, ఆహారం, టెస్టులు, జాగ్రత్తలు ఇవి అన్నీ తల్లి బాధ్యతలుగా భావించడం మన సమాజంలో చాలా సాధారణం. కానీ తాజా పరిశోధనలు, UK వైద్యుల షాకింగ్ వివరాలు ఒక కొత్త నిజాన్ని బయటపెట్టాయి. గర్భధారణ విజయవంతం కావడం, సమస్యలు రాకపోవడం, బిడ్డ ఆరోగ్యం ఇవి అన్నీ తండ్రి వీర్యకణాల నాణ్యతపై కూడా భారీగా ఆధారపడి ఉంటాయట.
అవును గర్భధారణ లక్షణాలు, ప్రీక్లాంప్సియా, గర్భధారణ మధుమేహం వంటి సమస్యలు మహిళలలో ఎందుకు వస్తాయి? దానికి కారణం వారు కాదు పురుషుల వీర్య కణాల ఆరోగ్యం కూడా కీలక పాత్ర పోషిస్తుందనే విషయం ఇప్పుడు బయటపడింది. ఇప్పటివరకు గర్భధారణ కోసం మహిళలే జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పెద్దల మాట. కానీ నేటి వైద్య శాస్త్రం చెబుతోంది ఏంటంటే బిడ్డ కోసం ప్రయత్నించే సమయంలో పురుషులు తమ జీవనశైలిని మార్చకపోతే, ప్రమాదం ఇద్దరికీ, కనబోయే బిడ్డకూ ఉంటుంది.
వీర్య కణాల నాణ్యత గర్భధారణ లక్షణాలను ప్రభావితం చేస్తుందా?
గర్భధారణ సమయంలో మహిళలు ఎదుర్కొనే అనేక సమస్యలు, లక్షణాలు భర్త వీర్య కణాల నాణ్యతపై ఆధారపడి ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీర్య కణాలు పూర్తిగా అభివృద్ధి చెందడానికి సుమారు 74 రోజులు పడుతుంది. అందుకే బిడ్డ కోసం ప్లాన్ చేసే పురుషులు కనీసం మూడు నెలల ముందే ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాల్సిందేనని డాక్టర్‌లు సూచించారు. “గర్భధారణ అంటే మహిళల బాధ్యత మాత్రమే అన్న భావన తప్పు” అని స్పష్టం చేశారు.
వీర్య కణాలు పేలవంగా ఉంటే వచ్చే ప్రమాదాలు:
పురుషుల వీర్య కణాలు ఆరోగ్యంగా లేకపోతే గర్భధారణ సమయంలో పలురకాల సమస్యల ప్రమాదం పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, గర్భధారణ మధుమేహం, వంటి ప్రమాదాలు ఎక్కువవుతాయని చెబుతున్నారు. అదేవిధంగా, పురుషుల ఆహారం, జీవనశైలి, ఒత్తిడి, ధూమపానం వంటి అలవాట్లు కేవలం వీర్య కణాల నిర్మాణాన్నే కాదు, వాటి జన్యు లక్షణాలను (Epigenetic Marks) కూడా ప్రభావితం చేస్తాయి. అందువల్ల పుట్టబోయే పిల్లల్లో భవిష్యత్తులో ఊబకాయం, మధుమేహం,గుండె జబ్బులు వంటి సమస్యల ఎదురుకుంటారట.
పురుషులు ఏం చేయాలి?
వీర్యకణాల నాణ్యత మెరుగుపరచడానికి పురుషులు ఈ విషయాలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ధూమపానం పూర్తిగా మానేయాలి, మద్యం తగ్గించాలి లేదా నివారించాలి, పోషకాహారం తీసుకోవాలి,జింక్, ఫోలేట్, ఒమేగా-3 లాంటి పోషకాలు ఆహారం లో చేర్చుకోవాలి. వ్యాయామం తప్పనిసరి, ఒత్తిడి తగ్గించే ధ్యానం, నడక వంటి అలవాట్లు పెంపొందించాలి. అంతే కాదు సరిగా నిద్రపోక పోవడం కూడా వీర్యకణాల నాణ్యత దెబ్బతీస్తుంది. అందుకే రోజుకు 7–8 గంటల నాణ్యమైన నిద్ర అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, ఒత్తిడి ఇవి అన్నీ కలిసే మెరుగైన వీర్య కణాలకు, ఆరోగ్యకరమైన గర్భధారణకు దోహదం చేస్తాయి.
