Fastest Journey On Foot: ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్ టర్న్‌బుల్ అనే 40 ఏళ్ల వ్యక్తి ‘ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వాకింగ్ జర్నీ’ పేరిట 20 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి గిన్నిస్ బుక్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు. క్రిస్ ఈ రికార్డ్ ను 39 రోజుల 8 గంటల 1 నిమిషంలో ఆస్ట్రేలియాలోని పెర్త్ నుండి సిడ్నీ వరకు 3,864 కిలోమీటర్లు పరిగెత్తాడు. ఈ మొత్తం దూరాన్ని కవర్ చేయడానికి అతను ప్రతిరోజూ దాదాపు 100 కిలోమీటర్లు పరిగెత్తాడు. ఈ రికార్డుతో 2002లో ఓ వ్యక్తి 67 రోజుల 2 గంటల 57 నిమిషాల్లో చేసిన రికార్డును క్రిస్ బద్దలు కొట్టాడు. ఇద్దరు పిల్లల తండ్రి అయిన క్రిస్.. తన జీవితంలో పెద్ద సాహసం చేసి ఈ రికార్డును నెలకొల్పాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా తన దేశాన్ని చూడటానికి ఇది గొప్ప మార్గంగా భావించానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
Read Also: Bangladesh vs South Africa: బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా విజయం.. పాయింట్ల పట్టికలో దూకుడు
ఈ సందర్బంగా క్రిస్ మాట్లాడుతూ.. నేను రేసులో దేశానికీ రెండు చివర్లలో సముద్రపు నీటిని తాకానని.. ఆ సమయంలో నేను చాలా అందమైన దృశ్యాలను చూశానని తెలిపాడు. ఈ జర్నీలో చాలా మంది స్నేహపూర్వక వ్యక్తులను కలిశానని, ఈ రికార్డును సృష్టించేందుకు తాను 3 నెలల పాటు ఇంటెన్సివ్ శిక్షణ తీసుకున్నానని, ఆ సమయంలో తాను ప్రతిరోజూ చాలా దూరం పరిగెత్తానని క్రిస్ చెప్పుకొచ్చాడు. తన రేసులో ఎక్కువ భాగం ఆస్ట్రేలియాలోని మారుమూల ప్రాంతాల గుండా వెళుతుందని, అందువల్ల సహాయక బృందాలు, సామాగ్రి, ఆకస్మిక ప్రణాళికలు అవసరమని అతను వివరించాడు.
ఇది క్రిస్ చేపట్టిన మొదటి రన్ ఇది కాదు. అతను ఇంతకు ముందు సిడ్నీ నుండి మెల్‌బోర్న్‌కు పరిగెత్తాడు. అతను అనేక అల్ట్రామారథాన్ లను కూడా పూర్తి చేశాడు. టాస్మానియా నుండి కింగ్ ఐలాండ్ మీదుగా విక్టోరియాకు బోటులో ప్రయాణించాడు. ఈ రికార్డ్ బ్రేకింగ్ జర్నీ తన ప్రణాళికల ప్రకారం జరగలేదని, అయినప్పటికీ ఇంత తక్కువ సమయంలో చాలా దూరం ప్రయాణించినందుకు చాలా సంతోషంగా ఉందని క్రిస్ చెప్పాడు. కొన్ని చోట్ల వర్షం కారణంగా రోడ్లు జారేవని, నేను జాగ్రత్తగా పరిగెత్తే వాడినని, ప్రతిరోజూ నా 100 కిలోమీటర్లు పూర్తి చేసేవాడినని తెలిపాడు. తాను ఆహారంపై శ్రద్ధ వహించలేదని, కేవలం శాండ్‌విచ్‌లు తినేవాడినని తెలిపాడు. అయితే, నా కష్టానికి ఫలితం దక్కిందని చెప్పుకొచ్చాడు.