Site icon NTV Telugu

Priyansh Arya: ఐపీఎల్‌లో ప్రియాంశ్‌ ఆర్య అరుదైన రికార్డు.. మొదటి బ్యాటర్‌గా..!

Priyansh Arya Ipl Century

Priyansh Arya Ipl Century

పంజాబ్ కింగ్స్ యువ ఓపెనర్‌ ప్రియాంశ్‌ ఆర్య అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన నాలుగో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. మంగళవారం ముల్లాన్‌పుర్‌ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో సెంచరీ బాదడంతో ప్రియాంశ్‌ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ మ్యాచ్‌లో ప్రియాంశ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 103 రన్స్ చేశాడు.

ఐపీఎల్‌లో ట్రావిస్‌ హెడ్‌ కూడా 39 బంతుల్లో శతకం చేశాడు. హెడ్‌ను ప్రియాంశ్‌ ఆర్య సమం చేశాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన శతకం చేసిన రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌ పేరిట ఉంది. 30 బంతుల్లోనే గేల్‌ సెంచరీ బాదాడు. 2013లో పూణే వారియర్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ ఈ శతకం బాదాడు. ఇప్పటికీ ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీగా నిలిచింది. ఆ మ్యాచ్‌లో యూనివర్సల్ బాస్ 175 పరుగులతో అజేయంగా నిలిచాడు.

క్రిస్ గేల్ తర్వాతి స్థానంలో యూసుఫ్ పఠాన్ ఉన్నాడు. 2010లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ ముంబై ఇండియన్స్‌పై 37 బంతుల్లో శతకం చేశాడు. భారత బ్యాటర్లలో అత్యంత వేగవంతమైన సెంచరీ ఇప్పటికీ యూసుఫ్ పేరిటే ఉంది. 2013లో మొహాలీలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున డేవిడ్ మిల్లర్ ఆర్సీబీపై 38 బంతుల్లో శతకం బాదాడు. 2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) తరఫున ట్రావిస్‌ హెడ్‌ 39 బంతుల్లో బెంగళూరుపై సెంచరీ చేశాడు. తాజాగా ప్రియాంశ్‌ ఆర్య కూడా 39 బంతుల్లో శతకం బాదాడు. ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన వారందరూ అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వారే. ప్రియాంశ్‌ మాత్రం ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దాంతో ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయకుండానే సెంచరీ బాదిన మొదటి బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు.

ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీలు:
30 – క్రిస్ గేల్ (బెంగళూరు) vs పూణే, బెంగళూరు, 2013
37 – యూసుఫ్ పఠాన్ (రాజస్థాన్) vs ముంబై, ముంబై BS, 2010
38 – డేవిడ్ మిల్లర్ (పంజాబ్) vs బెంగళూరు, మొహాలీ, 2013
39 – ట్రావిస్ హెడ్ (సన్‌రైజర్స్‌) vs బెంగళూరు, బెంగళూరు, 2024
39 – ప్రియాంష్ ఆర్య (పంజాబ్) vs చెన్నై, ముల్లాపూర్, 2025

Exit mobile version