Site icon NTV Telugu

FASTag Mandatory: “ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్.. ఫాస్టాగ్ లేకపోతే బండి కదలదు!”

Fastag Mandatory

Fastag Mandatory

FASTag Mandatory: జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద రద్దీ నివారణకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులపై నిషేధం విధించనుంది. ఏప్రిల్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అన్ని నేషనల్ హైవే టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులు పూర్తిగా నిషేధం అవుతున్నాయని తెలుస్తుంది. ఇకపై టోల్‌ రుసుము చెల్లించడానికి ఫాస్టాగ్ లేదా యూపీఐ మాత్రమే మార్గం కాబోతుంది. ఇది కేవలం డిజిటల్ భారత్‌కు మరో అడుగు కాదు.. హైవేలపై గంటల తరబడి నిలిచే రద్దీని తగ్గించి, ప్రయాణికుల ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి వేసే విప్లవాత్మక ముందడుగు.

READ ALSO: TDP vs Jana Sena Clash: టీడీపీ వర్సెస్‌ జనసేన.. కొట్టుకున్న నేతలు..!

ప్రస్తుతం టోల్‌ ప్లాజాల వద్ద పండగ సమయంలో నగదు లైన్లలో వాహనాలు కిలోమీటర్ల తరబడి బారులు తీరుతున్నాయి. బ్రేక్ వేసి, యాక్సిలరేట్ చేసి, మళ్లీ ఆగి.. ఇలా ఇంధనం వృథా అవుతోంది. కానీ ఈ కొత్త నిబంధనతో ఈ సమస్యలకు ఫుల్‌స్టాప్ పడుతుంది. భవిష్యత్తులో నో-స్టాప్ టోలింగ్ (బ్యారియర్ లేకుండా హైవే స్పీడ్‌లోనే ప్రయాణం) కూడా రానుందని సమాచారం. ప్రస్తుతం 25 టోల్ ప్లాజాల్లో ఇది పైలట్ ప్రాజెక్ట్‌గా జరుగుతోంది. కేంద్రం తీసుకున్న ఈ మార్పులు అమల్లోకి రావడానికి ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో ప్రయాణికులు అందరూ ఇప్పటి నుంచే సిద్ధపడితే ఏప్రిల్‌లో అవస్థలు తప్పుతాయి. ఫాస్టాగ్ లేని వారు తక్షణమే బ్యాంకు లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాలి. స్మార్ట్‌ఫోన్‌లో యూపీఐ యాప్‌లు సిద్ధం చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న వ్యాపారుల్లో ఇంకా డిజిటల్ చెల్లింపులకు అలవాటు లేని వారికి ఇది కొంత ఇబ్బందికరంగా అనిపించవచ్చు. కానీ ప్రభుత్వం ఈ విషయంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. నగదు రహిత టోల్ వసూళ్లతో ఇంధన ఆదా, తక్కువ కాలుష్యం, పారదర్శకత, వేగవంతమైన ప్రయాణాలు.. ఇవన్నీ ఒకేసారి సాధ్యమవుతున్నాయని చెబుతున్నారు. ఇది కేవలం టోల్ ప్లాజా మార్పు మాత్రమే కాదు.. ఇది భారత రహదారుల భవిష్యత్తుకు కొత్త అధ్యాయంగా మారుతుందని విశ్వసిస్తున్నారు. ఇక హైవేల మీద ప్రయాణం.. సాఫీగా.. సులభంగా.. స్మార్ట్‌గా జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Her Voice Her Story: భారతీయ సంగీతాన్ని మలుపు తిప్పిన మహిళల కథ.. ‘హర్ వాయిస్.. హర్ స్టోరీ’

Exit mobile version