Faria: సిల్వర్ స్క్రీన్ మీద తనదైన ఎనర్జీతో, చలాకీ నటనతో ప్రేక్షకులను మెప్పించే కథానాయిక ఫరియా అబ్దుల్లా. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిట్టిగా సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తోంది. కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో, వైవిధ్యభరిత నటుడు సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సిగ్మా’. భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ రూటెడ్ హైస్ట్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంపై పరిశ్రమలో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా, ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫరియా అబ్దుల్లా పంచుకున్న పలు వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.
ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్.. ఫరియా ఎదుగుదల గురించి ప్రస్తావిస్తూ, ఆమె వరుస హిట్లు అందుకోవడమే కాకుండా హైదరాబాద్‌లో సొంతంగా ఇల్లు కూడా కొనుక్కుని స్థిరపడిందంటూ ఆమెను వెనకేసుకొచ్చి ప్రశంసలు కురిపించారు. అయితే దీనిపై తాజాగా స్పందించిన ఫరియా నవ్వులు పూయిస్తూ ఆ విషయాన్ని సున్నితంగా ఖండించారు.”సందీప్ కిషన్ ఇటీవల, ప్రెస్‌మీట్లో నా గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు సొంతంగా కల్పించి జోడించేశారు. నేను ఇప్పటికే సొంత ఇల్లు కొనుక్కున్నానంటూ ఆయన చెప్పిన దాంట్లో నిజం లేదు. నేనింకా సొంతంగా ఇల్లు కొనలేదు. కానీ సందీప్ అంత గట్టిగా చెప్పిన తర్వాతైనా… కనీసం ఇప్పుడైనా ఒక ఇల్లు కొంటే బాగుంటుందేమో అని నేనూ ఆలోచిస్తున్నా” అంటూ తనదైన శైలిలో చమత్కరించారు.
సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ఇద్దరూ నిజజీవితంలో ఎప్పటినుంచో మంచి స్నేహితులు. ఇద్దరి ఎత్తు, పర్సనాలిటీలు చక్కగా సరిపోతాయని, ఎప్పటికైనా కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలాకాలంగా అనుకుంటున్నామని ఫరియా పేర్కొన్నారు. ‘సిగ్మా’ ప్రాజెక్ట్‌లోకి తనను ఎంపిక చేయడంలోనూ సందీప్ కిషన్ పాత్ర ఉందని, దర్శకుడు జాసన్ సంజయ్‌కు తన పేరును సందీపే ప్రస్తావించినట్లు వెల్లడించారు. సెట్స్‌లో వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం, ఈ చిత్రంలో వీరి ఆన్‌స్క్రీన్ జోడీపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.తమిళంలో తన తొలి చిత్రమైన ‘సిగ్మా’లో తాను ఒక ఆర్జే (రేడియో జాకీ) పాత్రలో పూర్తిస్థాయి భావోద్వేగాలు ఉన్న విభిన్నమైన రోల్ చేసినట్లు చెప్పిన ఫరియా, ఈ చిత్రం తన కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. సందీప్-ఫరియాల కెమిస్ట్రీ, విజయ్ తనయుడి డైరెక్షన్ కలగలిసిన ‘సిగ్మా’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

