Fake PhonePe Scam: ఈ రోజుల్లో ఏం షాపింగ్ చేసినా.. చాలా మంది డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. చిన్న చిన్న షాపుల నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు అన్నింటిలోనూ డిజిటల్ పేమెంట్స్ కోసం స్కానర్లు కనిపిస్తున్నాయి. క్రమక్రమంగా నోట్ల ద్వారా చెల్లింపులు తగ్గిపోయి.. డిజిటల్ పేమెంట్స్ వైపు జనం ఆసక్తి పెరుగుతోంది. అయితే ఈ డిజిటల్ పేమెంట్స్‌ను కూడా సైబర్ నేరగాళ్లు తమకు ఓ అవకాశంగా మలచుకుంటున్నారు. ఫోన్ పే, గూగుల్ పే లాంటి యూపీఐ పేమెంట్స్ ద్వారా జనాలకు కుచ్చుటోపీ పెడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో ఇలాంటి డిజిటల్ పేమెంట్స్ టోకరా ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పోయిన డబ్బు తక్కువ మొత్తమే అయినప్పటికీ.. ఇలాంటి తరహాలోనూ మోసాలు జరుగుతున్నాయని పోలీసులు జనాన్ని అలర్ట్ చేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని నటుకుల సూపర్ మార్కెట్ వద్ద ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.
READ ALSO: Cyber Crime: రూ.5 వేల కోట్ల ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్.. ఆన్‌లైన్ గేమింగ్, ఫిన్‌టెక్ కంపెనీల ముసుగులో!
ఇద్దరు వ్యక్తులు హ్యుందాయ్ కారులో వచ్చితాము పెద్దారవీడు మండలం కుంట సెంటర్‌లో రెస్టారెంట్ నిర్వహిస్తున్నామని షాప్ యజమాని శ్రీనివాసరావుతో మాటలు కలిపారు. రూ.25 వేల విలువైన వంట నూనె కావాలని కోరారు. భారీ మొత్తంలో కొనుగోలు కావడంతో షాప్ యజమానికి అనుమానం రాలేదు. షాపులో అంత సరుకు లేకపోవడంతో బయట నుంచి మరికొంత వంట నూనె తెప్పించారు. అన్నింటినీ వారి కారులో ఎక్కించారు. డబ్బులు ఇవ్వమని అడగగానే ఒక కేటుగాడు ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లిస్తామని అన్నాడు. మీ స్కానర్‌కి డబ్బులు పోవడం లేదు ఫోన్ పే నెంబర్ ఇవ్వండి అని అడిగాడు.
షాపులో పనుల్లో బిజీగా ఉన్న యజమాని, డబ్బులు ఫోన్‌పే కొట్టమని మార్కాపురానికి చెందిన సరుకుల డిస్టిబ్యూటర్ నెంబర్ ఇచ్చాడు. ఇక్కడే మోసానికి తెరలేచింది. ముందే మొబైల్‌లో ఏర్పాటు చేసుకున్న ఫేక్ ఫోన్‌పే యాప్ ద్వారా డబ్బులు పంపినట్టు కేటుగాళ్లు చూపించారు. డబ్బులు జమ అయినట్టుగా కనిపించే డమ్మీ మెసేజ్‌ను షాప్ యజమానికి చూపించారు. అది నిజమైన మెసేజ్ అనుకుని.. షాప్ యజమాని ఆ స్క్రీన్‌కు ఫోటో కూడా తీశాడు. అంతే ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా కేటుగాళ్లు పరారయ్యారు.
మరుసటి రోజు మార్కాపురం డిస్టిబ్యూటర్ షాప్‌కు రావడంతో.. రూ.25 వేల డబ్బుల రసీదు అడిగితే డబ్బులు ఖాతాలో జమ కాలేదని డిస్టిబ్యూటర్ స్పష్టం చేశాడు. దీంతో షాక్‌కు గురైన షాప్ యజమాని శ్రీనివాసరావు.. మోసపోయానని గ్రహించాడు. వెంటనే యర్రగొండపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లు కీలకంగా మారాయి. షాప్‌లోకి వచ్చిన కేటుగాళ్ల దృశ్యాలు వారు ఉపయోగించిన కారుటోల్ గేట్ వద్ద కారు కదలికలు అన్నీ కెమెరాల్లో నమోదయ్యాయి. కారు నెంబర్ ప్లేట్‌పై నల్లరంగు పూసి ఉండడం సీసీటీవీ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
మరోవైపు అదే రోజు.. పెద్దారవీడు మండలం కుంట సెంటర్‌లోని అనిత కిరాణా షాప్‌లో కూడా ఇదే తరహాలో మోసం చేశారు కేటుగాళ్లు. రూ.23 వేల విలువైన వంట నూనెను ఫేక్ ఫోన్‌పే ద్వారా మోసం చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఒకే రోజు ఒకే ముఠా ఇలాంటి పని చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ రెండు ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోనూ ఇలాంటి మోసమో జరిగింది. ఓ వ్యాపారికి కుచ్చుటోపి పెట్టాడు సైబర్ కేటుగాడు. చికెన్ వ్యాపారి దస్తగిరిని నమ్మించి 20 వేలు కొట్టేశాడు. కోడి మాంసం తీసుకునేందుకు వచ్చిన కేటుగాడు.. ముందుగా వేయి రూపాయల చికెన్‌ను కొనుగోలు చేసి పేమెంట్ చెల్లించాడు. ఆ తర్వాత అత్యవసరంగా 20 వేల నగదు కావాలని.. ఆ మొత్తాన్ని ఫోన్‌పే ద్వారా మీ ఖాతాకు పంపిస్తానని నమ్మించాడు. నగదు చెల్లించినట్టు ఫోన్‌లో సక్సెస్‌ఫుల్ మెసేజ్ చూపించి రూ. 20 వేలు తీసుకుని ఉడాయించాడు. ఆ కొద్దిసేపటికే తన ఖాతాలో నగదు చేక్ చేసుకున్న దస్తగిరి మోసపోయానని గ్రహించాడు. ఆ వెంటనే ఫోన్ చేసినా లాభం లేకపోయింది. ఒక్క రింగ్ తర్వాత కేటుగాడు ఫోన్‌స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు.
డిజిటల్ పేమెంట్స్ విషయంలో వ్యాపారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. డబ్బు వచ్చిందని స్క్రీన్‌షాట్ చూసి సరుకు ఇవ్వాలని చెబుతున్నారు. మీ ఫోన్‌పే యాప్‌లో బ్యాలెన్స్ నిజంగా పెరిగిందో లేదో చూసిన తర్వాతే సరుకు లేదా సేవలు అందించాలంటున్నారు.
READ ALSO: Wife Murder Attempt: డామిట్ .. భర్తను అడ్డంగా నరికేందుకు వేసిన స్కెచ్ బెడిసి కొట్టింది..
