Site icon NTV Telugu

Fake IAS Officer: నిత్య పెళ్లికొడుకు బాగోతం.. నకిలీ ఐఏఎస్‌గా 25 సార్లు పెళ్లిళ్లు.. ఎలా చిక్కాడంటే!

Fake Sdm

Fake Sdm

Fake IAS Officer: తానొక ఐఏఎస్ అధికారిని అని, జిల్లా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM)గా పనిచేస్తున్నానని నమ్మించి ఏకంగా 25 మంది మహిళలను పెళ్లి చేసుకుని ముంచేసిన ఒక ఘరానా మోసగాడి ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లా, ఇఖ్దిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లుధియత్ మొహల్లాకు చెందిన ప్రీతమ్ నిషాద్ అనే ఈ నకిలీ ఐఏఎస్ అధికారిని అరెస్టు చేసేందుకు గోరఖ్‌పూర్ పోలీసులు రంగంలోకి దిగారు. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: PM Modi: చమురు, గ్యాస్‌పై ఆందోళన అక్కర్లేదు.. భారతీయులంతా సురక్షితమేనన్న మోడీ

అసలు విషయం ఎలా బయటపడిందంటే..
గోరఖ్‌పూర్‌లోని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబం తమ చిన్న కుమార్తెకు పెళ్లి సంబంధం వెతుకుతుండగా, ఢిల్లీలో ఉంటున్న వారి పెద్ద కుమార్తెకు ఒక కమ్యూనిటీ గ్రూప్ ద్వారా నకిలీ ఐఏఎస్ ప్రీతమ్ నిషాద్ పరిచయమయ్యాడు. తాను మాణిక్‌పూర్ ఎస్‌డీఎమ్‌ (SDM) గా పనిచేస్తున్నానని, తన గ్రామానికి తానే మొదటి ఐఏఎస్ అధికారిని అని నమ్మబలికాడు. తన హోదాను నిరూపించుకోవడానికి నకిలీ ఇంటర్వ్యూ వీడియోలు, రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలను పంపి వారిని బుట్టలో వేసుకున్నాడు.

బాధితురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రీతమ్ పెళ్లికి ముందు ‘భారత ప్రభుత్వం’ అని రాసి ఉన్న కారులో, ఒక సహాయకుడిని వెంటబెట్టుకుని వచ్చాడు. పెళ్లి పత్రికలను క్యాబినెట్ మంత్రులకు, ఎంపీలకు పంచాలనే నెపంతో వారి నమ్మకాన్ని చూరగొన్నాడు. 2026 మార్చి 11న అత్యంత వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి ఖర్చుల పేరుతో బాధితురాలి కుటుంబం నుంచి రూ.15 లక్షల నగదు, మొత్తం మీద రూ.30 లక్షల వరకు వసూలు చేశాడు. అయితే పెళ్లి జరిగిన కొద్ది రోజులకే ప్రీతమ్ నివాసం ఉంటున్న గ్రామం నుంచి బాధితురాలి కుటుంబానికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ప్రీతమ్ ఒక పెద్ద మోసగాడని, ఇప్పటికే అతను 25 సార్లు వివాహాలు చేసుకున్నాడని, ఇది అతనికి 26వ పెళ్లి అని తెలియడంతో వారు నిర్ఘాంతపోయారు. వెంటనే ఇటావాకు వెళ్లి విచారించగా.. ఎస్‌డీఎమ్‌ అని చెప్పుకునే అతని ఇంట్లో కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేదని, అంతా బూటకమని తేలింది.

బాధితుల ఫిర్యాదు మేరకు గోరఖ్‌పూర్ కంటోన్మెంట్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రీతమ్ సోదరి, బావలను కూడా నిందితులుగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, ఇప్పటికే ఇటావాలోని తన నివాసంలో గాలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు దాక్కునే అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. పక్షవాతంతో బాధపడుతున్న ఆ బాధిత తండ్రి తన కష్టార్జితాన్ని అంతా పోగొట్టుకుని, కుమార్తె జీవితం ఇలా కావడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.

READ ALSO: CM Revanth Reddy: ప్రతి కుటుంబానికి భరోసా.. దేశంలో ఎక్కడా ఇలాంటి సదుపాయం లేదు

Exit mobile version