Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!

Fruad

Fruad

Medak: మెదక్ జిల్లాలో ఓ నకిలీ బాబా మోసం వెలుగులోకి వచ్చింది. తూప్రాన్ మండలం గుండ్రేడ్డిపల్లి గ్రామంలో ఓ యువతిని మాయమాటలతో నమ్మించి వివాహం చేసుకున్న వ్యక్తి, ఆ తర్వాత గుప్తనిధుల పేరుతో లక్షల రూపాయలు కాజేసిన ఘటన సంచలనం రేపుతోంది. విషయం బయటపడడంతో గ్రామస్తులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.

పోలీసుల అందించిన వివరాల ప్రకారం.. మస్తాన్ అనే వ్యక్తి తనను తాను బాబాగా పరిచయం చేసుకుంటూ, ఓ యువతిని నమ్మించాడు. “నన్ను పెళ్లి చేసుకుంటే నీ జన్మ సార్థకం అవుతుంది” అంటూ మాయమాటలు చెప్పి ఆమెను, కుటుంబ సభ్యులను నమ్మించి వివాహం చేసుకున్నాడు కేటుగాడు.

వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని నమ్మించి.. తవ్వకాలు చేయాలంటూ బాధిత కుటుంబం నుంచి లక్షల రూపాయలు తీసుకున్నాడు. గుప్తనిధులు బయటపడతాయని చెప్పి పలుమార్లు తవ్వకాలు కూడా నిర్వహించాడు. అయితే ఈ వ్యవహారం గ్రామంలో బయటపడడంతో మస్తాన్ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే కొంతకాలం తర్వాత తిరిగి గ్రామానికి రావడంతో అప్రమత్తమైన గ్రామస్తులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మస్తాన్‌కు ఇప్పటికే రెండు వివాహాలు జరిగినట్లు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.