NTV Telugu Site icon

Extremely Heavy Rains in Vijayawada: కుంభవృష్టి ధాటికి స్తంభించిన బెజవాడ.. అత్యవసరం అయితేనే బయటకు రండి..

Vja Rains

Vja Rains

Extremely Heavy Rains in Vijayawada: ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంతో విజయవాడ నగరం అతలాకుతలం అవుతుంది.. కుంభవృష్టి ధాటికి స్తంభించిపోయింది బెజవాడ.. అస్తవ్యస్తంగా మారిపోయాయి నగరంలో ఉన్న రోడ్లు.. విద్యాధరపురం, భవానీ పురం, చిట్టినగర్, సూర్యారావు పేట, వన్ టౌన్, గవర్నర్ పేట, సితార సెంటర్, ప్రభుత్వ వైద్య శాల, ఏలూరు రోడ్, మాచవరం, క్రీస్తు రాజ పురం, సింగ్ నగర్, డాబా కోట్లు సెంటర్, మొగల్రజ పురం జలమయం అయ్యాయి.. గడిచిన ఐదేళ్లలో ఇలాంటి వర్షం చూడలేదని చెబుతున్నారు నగర వాసులు.. ఇక, అత్యవసరం అయితేనే ఇంటి నుంచి బయటకు రండి.. అవసరం లేకపోతే ఇంటి నుంచి బయటకు రావద్దని కలెక్టర్ సృజన విజ్ఞప్తి చేశారు..

Read Also: IOB Recruitment 2024: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. వివరాలు ఇలా..

మరోవైపు.. దుర్గగుడి ఫ్లై ఓవర్ తాత్కాలికంగా మూసివేశారు.. లో బ్రిడ్జి దగ్గర నడుము లోతు మేర వర్షపు నీరు నిలిచిపోయింది.. వర్షపు నీటిలో మూడు బస్సులు, ఒక లారీ చిక్కుకుపోయాయి.. మరోవైపు.. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో పలు ఇళ్లు ధ్వంసం కాగా.. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.. శిథితాల నుంచి మరో మృత దేహాన్ని వెలికి తీశారు సహాయక సిబ్బంది. శిథిలాల నుంచి మహిళ మృతదేహం బయటకు తీశారు.. దీంతో.. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో మృతులు సంఖ్య రెండుకు చేరింది.. మృతులు మేఘన, అచ్చెమ్మగా గుర్తించారు.. ఘటనా స్థలం నుంచి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన. శిథిలాల్లో మరో ఇద్దరు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఇక, దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేశారు.. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉంటుందని ముందస్తుగా ఘాట్ రోడ్ మూసివేశారు అధికారులు.. ఘాట్ రోడ్డు దిగువన మూడు చెట్లు కూలిపోయాయి..

Read Also: Heavy Rainfall In Andhra Pradesh: మరో 3 రోజులు భారీ వర్షాలు.. అప్రమత్తమైన ప్రభుత్వం..

కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా సందర్శించారు.. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.. సిసోడియాకి పరిస్థితి వివరించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన.. మరోవైపు.. జిల్లాలో జోరున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కలెక్టర్‌.. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలి. ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దు. ఎక్కడైనా గృహాలు బలహీనంగా ఉన్నట్లయితే వెంటనే ఆ కుటుంబాలకు చెందినవారు సమీపంలో తహసిల్దార్ ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రానికి తరలి వెళ్లాలని సూచించారు.. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి సహాయ చర్యలను పర్యవేక్షించాలి. వరద ముంపు, కొండచరియలు విరిగిపడటం, బలహీనంగా ఇళ్ళు గుర్తింస్తే సంబంధిత ప్రజలను సమీప పునరావాస కేంద్రాలకు తరలించి తగిన సౌకర్యాలు కల్పించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు కలెక్టర్ సృజన..