NTV Telugu Site icon

New Liquor Policy: 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి కసరత్తు ప్రారంభం..

Ap News

Ap News

ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి పలుకుతూ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీకి నోటిఫికేషన్ జారీ చేసామని ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. రిజర్వేషన్ షాపులు మినహయించి మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి కసరత్తు ప్రారంభం అయ్యిందన్నారు. నూతన మద్యం పాలసీ అమలుకు దరఖాస్తులు మూడు విధాలుగా సబ్మిట్ చేయవచ్చని నిషాంత్ కుమార్ తెలిపారు. పూర్తి ఆన్లైన్ విధానంలో డెబిట్, క్రెడిర్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్ పేమెంట్ పద్ధతి ద్వారా పూర్తి చేయవచ్చన్నారు. దరఖాస్తు కోసం https://hpfsproject.com ద్వారా వివరాలు నమోదు చేయాలని , సబ్ మిషన్ తదుపరి పేమెంట్ మోడ్ వచ్చినప్పుడు బ్యాంకు కార్డ్స్ ద్వారా పని పూర్తి చేయవచ్చన్నారు. హైబ్రిడ్ విధానంలో వివరాలు నింపిన తరువాత సి ఎఫ్ ఎం ఎస్ ద్వారా ఎస్ బి ఐ నుండి చలానా వినియోగించి దరఖాస్తును సబ్మిట్ చేయాలన్నారు. మూడో పద్దతిలో డీడీ తీసుకుని నేరుగా రాష్టంలోని ఎక్సైజ్ స్టేషన్ కు వచ్చి అప్లికేషన్ పొందవచ్చని తెలిపారు. డీడీ నంబర్ ఆధారంగా ఎక్సైజ్ అధికారులు వెరిఫై చేసిన తదుపరి వారి రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుందన్నారు. మంగళవారం నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించామని, 12వ తేదీ నాటికి ప్రైవేటు మద్యం షాపులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని వివరించారు. రెండేళ్ల కాలపరిమితితో నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేయగా, అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకూ ఈ విధానం అమలవుతుందన్నారు.

READ MORE: UP: యూపీలో ఘోరం.. ఫీజు కట్టలేదని విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టిన ప్రిన్సిపాల్

ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చని అయితే ఒక్కో దరఖాస్తుకు రూ. 2 లక్షలు చొప్పున నాన్‌ రిఫండబుల్‌ దరఖాస్తు రుసుము చెల్లించాలని నిషాంత్ కుమార్ వివరించారు. డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా లేదా బ్యాంకు చలానా ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉండగా, డీడీ తీసుకుని నేరుగా ఎక్సైజ్‌ స్టేషన్లలో అందించే వెలుసుబాటు కూడా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఈ నెల 11న లాటరీ తీసి లైసెన్స్‌లు ఇస్తామని, 12 నుంచి లైసెన్సుదారులు కొత్త దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ (ఏపీఎస్బీసీఎల్) నడుపుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల విధానం గడువు సోమవారంతో ముగియగా, కొత్త దుకాణాలు ఏర్పాటు అయ్యే వరకు వీటినే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేసామని, యధావిధిగా మద్యం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

READ MORE: Sree Vishnu: మగ గొప్పా ? ఆడ గొప్పా ? అనేదే కథ : హీరో శ్రీవిష్ణు ఇంటర్వ్యూ

మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంత జనాభాను బట్టి మొత్తం నాలుగు శ్లాబుల్లో లైసెన్సు రుసుములు ఖరారు చేశామని నిషాంత్ కుమార్ తెలిపారు. తొలి ఏడాది పది వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షలు, 10 వేల నుంచి 50 వేల వరకు 55లక్షలు, 50,001 నుండి 5లక్షల వరకు జనాభా ఉంటే 65లక్షలు, ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 85 లక్షలుగా లైసెన్సు రుసుమును నిర్ణయించామని, రెండో ఏడాది ఈ రుసుములపై పది శాతం చొప్పున పెంచి వసూలు చేస్తారని తెలిపారు. ఏటా ఆరు విడతల్లో లైసెన్సు రుసుము చెల్లించవలసి ఉండగా, రిటైల్‌ వ్యాపారం చేసే లైసెన్సుదారుకు 20 శాతం మేర విక్రయ మార్జిన్ ఉంటుందన్నారు. నగరపాలక సంస్థల్లో మినహా మిగతా చోట్ల మద్యం దుకాణాలను మోడల్‌ స్టోర్స్‌కు అప్‌గ్రేడ్‌ చేసుకునేందుకు నూతన విధానంలో అవకాశం కల్పించామని, ఇందుకు ఏడాదికి ఐదు లక్షలు చొప్పున అదనంగా లైసెన్సు రుసుము చెల్లించాలని వివరించారు.ప్రస్తుతం నోటిఫై చేసిన 3,396 మద్యం దుకాణాలకు అదనంగా 12 ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయనుండగా వీటికి సంబంధించిన విధివిధానాలను విడిగా ఖరారు చేస్తామన్నారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించామని, ఈ స్టోర్ల కాలపరిమితిపై నిర్ణయం తీసుకోవలసి ఉందని, లైసెన్సు రుసుము ఏడాదికి కోటి రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని నిషాంత్ కుమార్ స్పష్టం చేసారు.

READ MORE:Ponguru Narayana: త్వరలో ఏపీ వ్యాప్తంగా కూల్చివేతలు.. స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని హెచ్చరిక

99 రూపాయలకే క్వార్టర్‌: మద్యం ధరలను ప్రభుత్వం తగ్గించాలని నిర్ణయించిందని, క్వార్టర్‌ 99 రూపాయలకే లభించేలా చర్యలు తీసుకున్నామని నిషాంత్ కుమార్ తెలిపారు. గతంలో మద్యంపై పది రకాల పన్నులు విధించగా,ఇప్పుడు వాటిని ఆరుకు కుదించామని, కొత్తగా మాదక ద్రవ్యాల నియంత్రణ సుంకం వసూలు చేయనున్నామని వివరించారు. దీని ద్వారా వచ్చే వంద కోట్లను గంజాయి, డ్రగ్స్‌ వినియోగంపై ఉక్కుపాదం మోపే చర్యలకు, వ్యసన విముక్తి, కౌన్సెలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ఉపయోగిస్తామన్నారు. గీత కార్మికులకు కేటాయించిన 340 దుకాణాలకు 2, 3 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తామని పేర్కొన్నారు. నూతన మద్యం విధానంకు సంబంధించి స్పష్టతతో పలు జిఓలను ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. తిరుపతి పట్టణంలో పరిమితంగానే షాపుల ఏర్పాటుకు అనుమతి ఉంటుందని నిషాంత్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి అలిపిరి వరకు బస్టాండు వరకు లీలామహల్‌ సర్కిల్, నంది సర్కిల్, విష్ణు నివాసం, శ్రీనివాసం ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు అవకాశం లేదన్నారు.

Show comments