Site icon NTV Telugu

Gujarat: గుజరాత్‌ సీఎం అభ్యర్థిని ప్రకటించిన ఆప్‌.. ఎవరో తెలుసా?

Aap Cm Candidate

Aap Cm Candidate

Gujarat: గుజరాత్‌లో ఎన్నికల తేదీలు ప్రకటించిన వేళ పలు పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు తమదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇవాళ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు. గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ టీవీ యాంకర్ ఇసుదాన్ గాధ్వి ఉంటారని ఆయన ప్రకటించారు. పంజాబ్‌ తరహాలోనే పోల్‌ నిర్వహించి సీఎం అభ్యర్థిని ప్రకటించారు. ఇప్పటికే అధికార బీజేపీని గద్దె దించాలని ఆప్ దూకుడుగా ప్రచారం చేస్తోంది. మాజీ జర్నలిస్ట్, టీవీ యాంకర్ అయిన ఇసుదాన్ గాధ్వి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే దానిపై ఆప్ సర్వేలో 73 శాతం ఓట్లు సాధించారు.

ఇదే విధమైన సర్వే తర్వాత పంజాబ్‌లో పార్టీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ సింగ్ మాన్‌ను ఎంపిక చేసింది. 40 ఏళ్ల ఇసుదాన్ గాధ్వి గతేడాది జూన్‌లో ఆప్‌లో చేరారు. అతను రాజకీయాల్లోకి రాకముందు గుజరాత్‌లో అత్యధిక రేటింగ్ పొందిన టీవీ వార్తలలో యాంకర్‌గా పనిచేశాడు. రాజకీయాల్లో తనలాంటి రైతు కుమారుడికి కేజ్రీవాల్‌ పెద్ద బాధ్యతను అప్పగించారని తన ఉద్వేగభరితమైన ప్రసంగంలో ఇసుదాన్ గాధ్వి అన్నారు. తాను చేయగలిగినంత సేవను చేయడానికి ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు. దేవుడు తనకు అన్నీ ఇచ్చాడని.. ఇప్పుడు తోటి గుజరాతీలకు కావాల్సినవన్నీ ఇవ్వాలనుకుంటున్నానన్నారు. తన చివరి శ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తానన్నారు.

Tensions on Korean Borders: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తత.. తృటిలో తప్పిన యుద్ధం

గుజరాత్‌ ఆప్‌ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా కూడా రేసులో ఉన్నారు. గోపాల్‌ ఇటాలియా గత సంవత్సరం గాధ్వీని సంప్రదించి, రాజకీయాల్లోకి ఆహ్వానించగా ఆయన ఆప్‌లో చేరారు. ఆప్ అధినేతతో సమావేశం అనంతరం ఆయన నిర్ణయం ఖరారైంది. గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడవుతాయి. ఇసుదాన్‌ గాధ్వీ రైతు కుటుంబానికి చెందినవారు. గుజరాత్ జనాభాలో 48 శాతం ఉన్న ఓబీసీ తరగతికి చెందిన గాధ్వీకి ఈ స్థానం దక్కడం గమనార్హం.

Exit mobile version