Site icon NTV Telugu

Late Age Degree: 74లో డిగ్రీ చదువు.. ఇంటర్‌ పాసైన మాజీ సైనికోద్యోగి

Late Age Degree

Late Age Degree

Late Age Degree: సాధారణంగా 15 ఏళ్లకు ఎస్‌ఎస్‌సీ.. 17 ఏళ్లకు ఇంటర్‌ చదువుతారు.. ఇంటర్‌ తరువాత డిగ్రీలో చేరుతారు. అయితే తెలంగాణ రాష్ర్టంలో లేటు వయస్సులో ఒకతను చదువుపై తనకున్న మక్కువను తీర్చుకోవాలనుకున్నాడు. అప్పుడెప్పుడో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేసిన వ్యక్తి ఇప్పుడు ఇంటర్‌, తరువాత డిగ్రీ చేయాలనుకున్నాడు. అతనే 74 సంవత్సరాల కల్లా నాగ్‌శెట్టి.. హైదరాబాద్‌లో ఉప్పుగూడ శివాజీనగర్‌ నివాసి అయిన కల్లా నాగ్‌శెట్టి. బీదర్‌ జిల్లాలో 1949లో జన్మించిన ఆయన ఎస్‌ఎస్‌ఎల్‌సీ(మెట్రిక్యులేషన్‌) వరకు అక్కడే చదివారు. ఉన్నత చదువులు చదవాలనుకున్నా కుటుంబ ఆర్థిక పరిస్థితులతో సాధ్యంకాలేదు. ఆ క్రమంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి హాజరై సిపాయిగా ఉద్యోగంలో చేరాడు. 21 ఏండ్లు ఆర్మీలో పనిచేసి జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌గా (జేసీవో) పదవీ విరమణ పొందాడు. 1971 ఇండో పాక్‌ యుద్ధం, 1984 ఆపరేషన్‌ బ్లూస్టార్‌లలో పాల్గొన్నాడు. శ్రీలంకకు పంపించిన శాంతిసేన సభ్యుడిగాను సేవలందించి పదవీ విరమణ చేశాడు. ఆ తర్వాత మరో 21 ఏండ్లు ప్రైవేట్‌ కంపెనీల్లో పలు ఉద్యోగాలు చేశాడు.

Read Also: Asaduddin Owaisi: దమ్ముంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్స్ చేయండి.. కేంద్రానికి ఓవైసీ సవాల్..

అయితే, చిన్నప్పుడు ఆపేసిన చదువును మళ్లీ కొనసాగింగించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఇంటర్‌ బోర్డును సంప్రదించారు. ఇంటర్మీడియట్‌ చదవడానికి ఇంటర్‌బోర్డు నుంచి అనుమతి తెచ్చుకొన్నారు. సైదాబాద్‌లోని గోకుల్‌ జూనియర్‌ కాలేజీలో సీఈసీలో అడ్మిషన్‌ పొందాడు. ఈ ఏడాది మార్చిలో ఇంటర్‌ వార్షిక పరీక్షలు రాశాడు. ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో ఏకంగా 77.04 పర్సంటేజీతో ఇంటర్‌ పూర్తిచేశాడు. ఇంటర్‌ ఉత్తీర్ణత సాధించిన నాగ్‌శెట్టి ఇప్పుడు డిగ్రీలో చేరడానికి దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. తనకు చదువుకునే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు, విద్యాశాఖ మంత్రి పీ సబితాంద్రారెడ్డికి నాగ్‌శెట్టి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version