Perni Nani and Collector Prasanna Venkatesh: మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మధ్య వివాదం మరింత ముదిరింది.. ఈ వ్యవహారం సీఎస్, సీఎం వరకు వెళ్లింది.. సీఎస్ జవహర్‌రెడ్డిని కలిసిన పేర్ని నాని.. ప్రసన్న వెంకటేష్ ఫిర్యాదు చేయగా.. మరోవైపు.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్.. ఈ ఎపిసోడ్‌పై సీఎం వైఎస్ జగన్‌కు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.. ఈ రోజు సీఎస్ జవహర్ రెడ్డిని కలిశారు మాజీ మంత్రి పేర్ని నాని.. జిల్లాల విభజన తర్వాత ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే జరుగుతోన్న జెడ్పీ సమావేశాలకు పలువురు కలెక్టర్లు హాజరు కావడం లేదంటూ ఫిర్యాదు చేశారు.. ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ రాకపోవడంపై పేర్ని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఏలూరు కలెక్టర్ తీరు మీద సీఎం ఇంటి వద్ద ధర్నా చేస్తానన్న వార్నింగ్ ఇచ్చారు.. నిన్న ఏలూరు కలెక్టరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పేర్నినాని.. ఇవాళ సీఎస్ కు ఫిర్యాదు చేస్తుండడంతో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.
ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. 2019 ఎన్నికల్లో జిల్లాల విభజన చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీల్లో భాగంగా విభజన చేశారు. అయితే అప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోవడంతో జెడ్పీ సర్వ సభ్య సమావేశాలు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన జరుగుతున్నాయి. రాష్ట్రానికి సీఎంకు సర్వాధికారం ఎలా ఉందో.. జిల్లాల్లో కలెక్టర్లకి అలాగే సర్వాధికారాలు ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి రెండు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో కలిసాయి.. ఏలూరు జిల్లా నుంచి వ్యవసాయ జెడీఈ తప్ప హోదా ఉన్న అధికారులెవ్వరూ రాలేదు. ఏలూరు జిల్లా నుంచి చిన్న అధికారులనో.. గుమాస్తాలనో పంపారు. ఇలాగైతే ప్రజల సమస్యల పరిష్కారం అయ్యేది ఎలా..? ప్రజలు ఓట్లేయడం దేనికి..? అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పేర్ని నాని..
వచ్చే సమావేశాలకు ఏలూరు కలెక్టర్ రాకుంటే సీఎం వైఎస్ జగన్ వద్దే కూర్చొంటానన్న మాట నుంచి వెనక్కి వెళ్లడం లేదని స్పష్టం చేశారు పేర్నినాని.. నేనేదో ప్రభుత్వాన్ని.. సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించానని కొందరు అంటున్నారు. రాష్ట్ర పెద్దగా సీఎంగా ఉన్న జగన్‌కు కాకుండా ఇంకా ఎవరికి చెప్పుకుంటాం అని ప్రశ్నించారు.. ఇందులో నేనేం ప్రెస్టేజీకి పోవడం లేదు. ఆరు నెలల్లో రిటైర్డ్ అయ్యేవాడిని నాకేం ప్రెస్టేజ్ ఉంటుందన్నారు.. అధికార పార్టీలో ఉన్న వ్యవస్థల్లో లోపాలు సరిదిద్దే ప్రయత్నం చేస్తే తప్పా..? అని ప్రశ్నించారు నాని.. నిన్ననే ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌తో మాట్లాడాను. వ్యవస్థలకు భంగం కలగకూడదనే నేను మాట్లాడానని ప్రసన్న వెంకటేష్‌కు చెప్పానన్న ఆయన.. జెడ్పీ సమావేశానికి హాజరు కావడం మాండేటరీ కాదు అని ఏలూరు కలెక్టరు అన్నారు. అదే కరెక్ట్ అయితే సరి చేయమని చెప్పడానికే సీఎస్‌ను కలిశానన్నారు.. కలెక్టర్లు జెడ్పీ సమావేశాలకు రావాలని సీఎస్ స్పష్టం చేశారని.. జెడ్పీ సమావేశాలకు హాజరు కావాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిస్తామని సీఎస్ చెప్పారని వెల్లడించారు. అయితే, అధికార పార్టీలో ఉంటే సమస్యలు ప్రస్తావించకూడదా..? అని ఎదురుప్రశ్నించారు.. ప్రతిపక్షం నిద్రపోతే ఏం చేయాలి..? సీఎం దగ్గరకు కాకుండా.. ఎవరి వద్దకెళ్లాలి..? చంద్రబాబు దగ్గరకో.. హు.. హ అనే వ్యక్తి దగ్గరకో వెళ్లాలా..? అంటూ సెటైర్లు వేశారు మాజీ మంత్రి పేర్నినాని.
మరోవైపు.. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్.. మాజీ మంత్రి పేర్ని నాని ఎపిసోడ్ నేపథ్యంలో ఆయన క్యాంపు కార్యాలయానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.. ఉమ్మడి కృష్ణా జెడ్పీ సమావేశానికి హాజరు కావటం లేదని నిన్న కలెక్టర్ పై పేర్ని నాని ఫైర్ అయిన విషయం విదితమే కాగా.. సీఎం ఇంటి దగ్గర ధర్నా చేస్తామని లేఖ రాయలని జడ్పీ ఛైర్మ్‌పర్సన్ ను కోరారు.. ఓవైపు కలెక్టర్ ప్రసన్న పై సీఎస్ జవహర్ రెడ్డికి మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు చేయగా.. మరోవైపు.. సీఎం జగన్‌ను కలెక్టర్ కలవడం ఆసక్తికరంగా మారింది.