Site icon NTV Telugu

ప్రతి ఒక్క‌రూ టీకా తీసుకోవాలి : గ‌వ‌ర్నర్ త‌మిళిసై

క‌రోనా వైర‌స్ ను ఎదుర్కోవ‌డానికి వీలుగా ప్రతి ఒక్క‌రూ టీకా తీసుకోవాల‌ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ పిలుపునిచ్చారు. కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ‌కు చెందిన రీజిన‌ల్ ఔట్‌రీచ్‌ బ్యూరో (ఆర్ఓబీ)  కోవిడ్ జాగ్ర‌త్త‌లు, వ్యాక్సినేష‌న్‌పై ఏర్పాటుచేసిన డిజిటల్ మొబైల్ వీడియో పబ్లిసిటీ వాహ‌నాల‌ను శ‌నివారం ఆమె రాజ‌భ‌వ‌న్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంత‌కు ముందు ప్ర‌జ‌ల‌లో కోవిడ్ టీకాపై ఉన్న సంశ‌యం క్ర‌మంగా తొల‌గిపోయి ప్రస్తుతం భార‌త్ 42 కోట్ల మందికిపైగా ప్ర‌జ‌ల‌కు టీకా అందించి ప్ర‌పంచంలోనే అత్య‌ధిక మందికి టీకాలు అందించిన దేశాల‌లో ఒక‌టిగా అవ‌త‌రించింద‌ని అన్నారు.

టీకా తీసుకుని క‌రోనా వైర‌స్ ప‌ట్ల బాహుబ‌లిగా మారాల‌న్న ప్ర‌ధాన‌మంత్రి పిలుపును ప్ర‌స్తావిస్తూ ఆయ‌న సందేశాన్ని ఇంకా టీకా ప‌ట్ల సంశ‌యాలు ఉన్న గ్రామీణ‌, గిరిజ‌న ప్రాంతాల‌కు చేర‌వేయాల‌ని ఆమె పిలుపునిచ్చారు. తాను స్వ‌యంగా ఇటీవ‌ల ఒక గిరిజన ప్రాంతంలో కోవిడ్ టీకా రెండో డోసు తీసుకున్న విషయాన్ని గ‌వ‌ర్న‌రు గుర్తు చేశారు. కోవిడ్ టీకా ఆవ‌శ్య‌క‌త‌పై ప్ర‌ధాని త‌ర‌చుగా ఇస్తున్న సందేశాలు, 18 ఏళ్లు పైబ‌డిన ప్ర‌తి ఒక్క‌రికీ ఉచిత టీకాలు అందించాల‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ప్ర‌జ‌లంద‌రికీ చేర‌వేయాల‌ని ఆమె అన్నారు. 

కోవిడ్ వ్యాక్సినేష‌న్‌పై స‌రైన స‌మ‌యంలో ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నందుకు రీజ‌న‌ల్ ఔట్‌రీచ్ బ్యూరోను అభినందించిన గ‌వ‌ర్న‌రు, ఆర్ఓబీ రూపొందించిన ల‌ఘు చిత్రాలు, క్రియేటివ్స్ ప్ర‌జ‌ల‌లో టీకాల‌పై అవ‌గాహ‌న పెంచ‌డానికి ఎంతో దోహ‌ద ప‌డ‌తాయ‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

Exit mobile version