నా జన్మంతా ఈ ప్రాంతానికి సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. “గజ్వేల్ నుంచి కేడీ వచ్చినా.. ఢిల్లీ నుంచి మోదీ వచ్చినా పాలమూరులో కాంగ్రెస్ ను ఓడించలేరు. అమెరికాలో చదువుకునో, వారసత్వ రాజకీయలతోనో నేను మీ ముందుకు ముఖ్యమంత్రిగా రాలేదు. నేను చదువుకుంది వనపర్తి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో. ఆనాడు చిన్నారెడ్డి గెలుపు కోసం రాతలు రాసినవాన్ని. మీ ఆశీర్వాదంతోనే ఈ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టా. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యి 150 రోజులు కాకముందే.. కొందరు దిగిపో దిగిపో అంటున్నరు. ఈ పాలమూరు బిడ్డను ముఖ్యమంత్రి నుంచి దించడానికి ఇంకొందరు ఢిల్లీ నుంచి గొడ్డలి తీసుకుని బయలుదేరారు.ఇంకొందరు శత్రువు పంచన చేరి మనల్ని ఓడించాలని చూస్తున్నారు. డీకే అరుణమ్మ కాంగ్రెస్ ను ఓడించాలని చెబుతుంది. అరుణమ్మా.. కాంగ్రెస్ నీకు ఏం అన్యాయం చేసింది? నిన్ను గద్వాల కు ఎమ్మెల్యే గా చేసినందుకా? ఉమ్మడి రాష్ట్రంలో నిన్ను మంత్రిని చేసినందుకా? అరుణమ్మకు ఇంత పేరు తెచ్చిపెట్టింది కాంగ్రెస్ కాదా.? మోదీ చేతిలో చురకత్తివై నీకు ఇంత చేసిన కాంగ్రెస్ ను కడుపులో పొడవాలని చూస్తున్నావా?”
READ MORE: Question Hour With BJP Kishan Reddy LIVE: క్వశ్చన్ అవర్ విత్ కిషన్ రెడ్డి
ఎంతో గొప్ప అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించాలని నేను అడగడం తప్పా? ఇది నేరమా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “మాదిగల ఏబీసీడీ వర్గీకరణ కోసం ఢిల్లీలో మాట్లాడేవారు ఉండాలంటే వంశీ గెలవాలి. ముదిరాజు సోదరులను బీసీ డీ నుంచి ఏ గా మార్చేందుకు. సుప్రీంకోర్టులో సమస్యలు పరిష్కరించేందుకు వంశీ గెలవాలి. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు. వంశీచంద్ రెడ్డి ఎంపీగా గెలవాలి. మోదీ చుట్టంలా వచ్చి పోతారు. ఏనాడైనా అరుణమ్మ వీటిపై మాట్లాడిందా? ప్రాజెక్టులు రిపేర్లు చేయాలన్న ఆలోచన చేసిందా? రేవంత్ రెడ్డి నాపై పగ పట్టారని అరుణమ్మ అంటుంది. ఆమెకు నాకు ఏమైనా గెట్టు పంచాయితీ ఉందా? రేవంత్ రెడ్డిని పడగొట్టేందుకు అమిత్ షాతో పైరవి చేసి ఢిల్లీలో కేసులు పెట్టించింది. రేవంత్ రెడ్డిని జైలుకు పంపైనా సరే రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటోంది. ఇక్కడ కల్తీ కల్లు దందాలు, క్రషర్ దందాలు, సారా దందాలు ఎవరివి? ఇన్ని దందాలు చేసేవాళ్లు నన్ను బెదిరించి నాది తప్పు అని అంటున్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీపై కేసీఆర్, హరీష్ మాట్లాడుతున్నారు.. 69 లక్షల మందికి రూ.7500 కోట్లు రైతు భరోసా అందించే బాధ్యత నాది.”
కురుమూర్తి స్వామి సాక్షిగా పంద్రాగస్టులోగా 2లక్షల రైతు రుణమాఫీ చేసి పాలమూరు రైతుల రుణం తీర్చుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు. “రైతుల రుణం తీర్చుకోకపోతే నా ఈ జన్మ వృథా.హరీష్ రావు.. రాజీనామా పత్రం రెడీగా పెట్టుకో. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి సిద్దిపేటకు పట్టిన శని వదిలిస్తా.. బీజేపీ తెలంగాణకు ఇచ్చింది.. మోదీ తెచ్చింది ఏమీ లేదు.. గాడిద గుడ్డు తప్ప. గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలి. పాలమూరు జిల్లాలో బీజేపీని పాతరేయాలి. వంశీ చంద్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలి.”