strong support for Ukraine: ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం ముగింది. అలాస్కాలో ఈ రెండు అగ్రదేశాల అధ్యక్షుల మధ్య జరిగిన సమావేశం ముగిసిన తర్వాత యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాల నుంచి కీలక ప్రకటన వచ్చింది. యూరోపియన్ యూనియన్ నాయకులు ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగించాలని ప్రకటించారు. ఉక్రెయిన్ భద్రతా హామీలు పొందడానికి ఈయూ దేశాలు తమ పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రకటనలో పేర్కొంది. దీనితో పాటు ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఎటువంటి మార్పును ఈయూ బలవంతంగా ఆమోదించదని స్పష్టం చేసింది.
READ MORE: MP: టెన్షన్.. టెన్షన్.. దర్గాపై హిందూ జెండా ఎగరేసిన దుండగులు..
కచ్చితమైన భద్రతా హామీలను పొందాలి..
యూరోపియన్ మద్దతుతో త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటన పేర్కొంది. ఉక్రెయిన్ తన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను సమర్థవంతంగా కాపాడుకోవడానికి కచ్చితమైన భద్రతా హామీలను పొందాలని స్పష్టంగా చేసింది. అమెరికా భద్రతా హామీలను అందించడానికి సిద్ధంగా ఉందన్న అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్ సాయుధ దళాలపై లేదా మూడవ దేశాలతో దాని సహకారంపై ఎటువంటి పరిమితులు ఉండకూడదని, EU, NATO లలో ఉక్రెయిన్ ప్రవేశం పొందేందుకు రష్యా వీటోను కలిగి ఉండకూడదని పేర్కొంది.
ఉక్రెయిన్ తన భూభాగంపై నిర్ణయం తీసుకుంటుందని, అంతర్జాతీయ సరిహద్దులను బలవంతంగా మార్చకూడదని, ఉక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేసింది. పోరాటం ముగిసి న్యాయమైన, శాశ్వత శాంతి నెలకొల్పడానికి, ఉక్రెయిన్‌ను బలంగా నిలబెట్టడానికి తాము మరిన్ని ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్‌లో హత్యలు కొనసాగుతున్నంత కాలం రష్యాపై ఒత్తిడిని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటన పేర్కొంది.
ఫ్రెంచ్ అధ్యక్షుడి స్పందన
ట్రంప్- పుతిన్ సమావేశం తర్వాత ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఒక ప్రకటనలో స్పందించారు. అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన సమావేశం తర్వాత ఈరోజు ఉదయం ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యూరోపియన్ మిత్రదేశాలతో సమన్వయ సమావేశం జరిగిందన్నారు. సమావేశం ముగింపులో యూరోపియన్ మిత్రదేశాలతో చర్చలను కొనసాగించామని తెలిపారు. ఏదైనా శాశ్వత శాంతికి తోడుగా దృఢమైన భద్రతా హామీలు ఉండాలన్నారు. ఈ విషయంలో అమెరికా సహకరించడానికి సంసిద్ధంగా ఉండటాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఐక్యత, బాధ్యతాయుత స్ఫూర్తితో తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి కలిసి పని చేయడం కొనసాగిస్తామని, ఫ్రాన్స్ పూర్తిగా ఉక్రెయిన్ వైపు ఉందని స్పష్టం చేశారు.
READ MORE: Heart Attack Symptoms: మీకు ఈ లక్షణాలు ఉన్నాయా? గుండెపోటు తప్పదట..!
