వరంగల్ జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఎంఆర్‌ఐ స్కానింగ్ సెంటర్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఎంజీఎం ఆస్పత్రిలో 10కోట్ల 60 లక్షలతో ఏర్పాటు చేసిన ఎంఆర్‌ఐ స్కానింగ్ సెంటర్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కంకణం కట్టుకున్నాని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంజీఎం ఆసుపత్రి అభివృద్ధికి నోచుకోలేదని, కేసీఆర్ పాలనలో ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు కార్పోరేట్ వైద్యం అందుతుందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. 1100 కోట్లతో దేశంలో ఎక్కడ లేని విధంగా 24అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నామని, దసరా నాటి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కొవిడ్ సమయంలో వైద్యులు అద్భుతంగా పని చేశారన్నారు మంత్రి ఎర్రబెల్లి.
అనంతరం ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ.. వరంగల్ నగరం వైద్య రంగంలో దూసుకుపోతుందని, వరంగల్ నగరం హెల్త్ సిటీగా అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలోనే మొదటిసారిగా 24 అంతస్తుల ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందని, మెరుగైన వైద్యం కోసం రాబోయే రోజుల్లో హైదరాబాద్ కు పోవాల్సిన అవసరం ఉండదని, ప్రభుత్వ ఆసుపత్రులు కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా రోగులకు సేవలందిస్తోందన్నారు ఎమ్మెల్యే నరేందర్.