EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. వాయిదాల రూపంలో డబ్బుల విత్ డ్రాకు అవకాశం..

Epfo

Epfo

ప్రైవేట్ ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) శుభవార్త అందించింది. ఇకపై పదవీ విరమణ తర్వాత మీ పీఎఫ్ (PF) ఖాతాలో జమ అయిన మొత్తం డబ్బును ఒకేసారి విత్‌డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. రిటైర్మెంట్ అనంతరం పీఎఫ్ సొమ్మును క్రమపద్ధతిలో వాయిదాల రూపంలో తీసుకునేందుకు వీలు కల్పించే ‘సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్’ (SWP) ప్రతిపాదనకు EPFO ఆమోదం తెలిపింది. నేడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో ఈ కీలక నిర్ణయానికి పచ్చజెండా ఊపారు.

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, 58 ఏళ్ల వయసులో రిటైర్ అయిన తర్వాత మూడేళ్లలోపు పూర్తి పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోకపోతే ఆ ఖాతా ఇన్‌ఆపరేటివ్ గా మారి వడ్డీ నిలిచిపోతుంది. కానీ కొత్త SWP విధానం ద్వారా ఉద్యోగులు తమ అవసరాలకు అనుగుణంగా ప్రతినెలా, మూడు నెలలకొకసారి లేదా ఏడాదికొకసారి కొంత మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. అంతేకాకుండా.. కొంత డబ్బును ఒకేసారి తీసుకుని మిగిలిన మొత్తాన్ని SWP ద్వారా పొందడం లేదా కేవలం వడ్డీని మాత్రమే విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కూడా లభించనుంది. ఖాతాలో మిగిలి ఉన్న అసలు మొత్తంపై యథావిధిగా (ప్రస్తుతం 8.25 శాతం) వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. ఒకవేళ వాయిదాలు తీసుకుంటున్న సమయంలో సభ్యుడు మరణిస్తే, నామినీ లేదా కుటుంబ సభ్యులు మిగిలిన మొత్తాన్ని ఒకేసారి తీసుకోవచ్చు లేదా వాయిదాలను కొనసాగించవచ్చు.

ఈ కొత్త విధానం వల్ల బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD), కమర్షియల్ యాన్యుటీల కంటే ఎక్కువ రాబడి లభిస్తుందని EPFO అంచనా వేస్తోంది. ఉదాహరణకు.. ఒక ఉద్యోగి వద్ద రూ. 50 లక్షల రిటైర్మెంట్ ఫండ్ ఉంటే, 6 శాతం వడ్డీతో కమర్షియల్ యాన్యుటీలో నెలకు రూ. 30,637 చొప్పున 20 ఏళ్లలో రూ. 73.5 లక్షలు లభిస్తాయి. బ్యాంక్ ఎఫ్‌డీలో 7 శాతం వడ్డీతో నెలకు రూ. 32,492 చొప్పున 20 ఏళ్లలో రూ. 78 లక్షలు వస్తాయి. అదే EPF SWP లో 8 శాతం వడ్డీ లెక్కన నెలకు సుమారు రూ. 41,822 చొప్పున 20 ఏళ్లలో దాదాపు రూ. 1 కోటి వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంది.