NTV Telugu Site icon

Delhi: ఢిల్లీలో భారీ వాహనాలపై ఆంక్షలు

Delhi

Delhi

స్వాతంత్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. నోయిడా, ఘజియాబాద్‌ల నుంచి ఢిల్లీ వైపు వచ్చే భారీ వాహనాల ప్రవేశంపై సోమవారం రాత్రి నుంచి ఆగస్టు 15 వరకు ఆంక్షలు ఉంటాయని, ఈ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లిస్తామని ఆదివారం ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ట్రాఫిక్‌ జామ్ కాకుండా చూడటానికి సుమారు 3,000 మంది ట్రాఫిక్ పోలీసులను నియమించారు. దేశ రాజధానిలోని ప్రధాన జంక్షన్లు, ఎర్రకోటకు వెళ్లే రహదారులపై ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్లియర్ చేయనున్నారు.

Read Also: Sridevi: ఫస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ ఇన్ ఇండియా .. తొమ్మిదిమంది సూపర్ స్టార్స్ తో

ఆగస్టు 14 రాత్రి 10 గంటల నుండి భారీ వాహనాలను ఢిల్లీ సరిహద్దులో నిలిపివేయనున్నారు. అనంతరం ఆగస్టు 15న కార్యక్రమం ముగిసిన తర్వాత లోపలికి పంపించనున్నట్లు స్పెషల్ కమిషనర్ పోలీసు (ట్రాఫిక్) ఎస్ఎస్ యాదవ్ తెలిపారు. అంతేకాకుండా.. జేఎల్‌ఎన్‌ మార్గ్‌, బహదూర్‌ షా జఫర్‌ మార్గ్‌, రింగ్‌ రోడ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎర్రకోట సమీపంలో వాహనాల రాకపోకలను నియంత్రిస్తామన్నారు. మరోవైపు ఆంక్షల దృష్ట్యా.. నిత్యావసర సేవలపై ఎలాంటి ప్రభావం పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎర్రకోట చుట్టూ భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి.. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్లియర్ చేయనున్నట్లు స్పెషల్ కమిషనర్ పోలీసు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో నిర్వహించే వేడుకలకు హాజరయ్యేందుకు వివిధ దేశాల నుంచి వచ్చే సామాన్య ప్రజలు, దౌత్యవేత్తలు రానున్నారు. వారి కోసం పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేసినట్లు అధికారులు తెలిపారు.