Rohit Paudel: నిన్న జరిగిన ఇంగ్లండ్ vs నేపాల్ మ్యాచ్ చాలా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ముంబై వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నేపాల్ జట్టు చరిత్ర సృష్టించే స్థాయికి చాలా దగ్గరగా వెళ్లింది. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఇంగ్లండ్‌తో జరిగిన తమ తొలి టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లో నేపాల్ కేవలం 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫలితం నిరాశ కలిగించినా, నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ మాటల్లో మాత్రం గర్వం, ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించాయి. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్, చివరి వరకు పోరాడింది. ఒక దశలో ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచింది. ముఖ్యంగా రోహిత్ పౌడెల్, దీపేంద్ర సింగ్ ఐరీ కలిసి చేసిన 82 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్ దిశనే మార్చేసింది. ఆ సమయంలో వాంఖడే స్టేడియంలో ఉన్న ప్రేక్షకులందరూ నేపాల్ గెలుస్తుందని ఉత్కంఠతో ఎదురు చూశారు. కానీ చివర్లో పరుగులు రాకపోవడంతో నేపాల్ 180/6కే పరిమితమైంది.
READ MORE: Lawyers Fees Hike: కోర్టులో కేంద్రం తరపున వాదించే న్యాయవాదుల ఫీజులు పెంపు.. పూర్తి వివరాలు ఇవే
మ్యాచ్ తర్వాత నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ మాట్లాడాడు. “మేము నిరాశ చెందాం. కానీ మా జట్టుపై నాకు చాలా గర్వంగా ఉంది. ఇంగ్లండ్ లాంటి పెద్ద జట్టుకు ఎదురొడ్డి మా ఆటగాళ్లు చూపిన ధైర్యం నిజంగా అభినందనీయం. మేం మైదానంలోకి అడుగుపెట్టే ముందు ఒక మాట చెప్పుకొన్నాం. మ్యాచ్ గెలిచేందుకు 110 శాతం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చాం” అని చెప్పాడు. ఆటగాళ్లు నిజంగానే తమ శక్తిమంతా పెట్టి ఆడారని, అందుకే వాళ్లపై తాను గర్వపడుతున్నానని తెలిపాడు. తము ఎవరికైనా ఓడించగలమనే విశ్వాసంతోనే ఇక్కడికి వచ్చామని. తమ టీం పూర్తి శక్తిని ఉపయోగించి ఆడితే ఏ జట్టుకైనా గట్టి పోటీ ఇవ్వగలమని తమకు తెలుసన్నాడు. ఈరోజు తాము అదే చేశామని కెప్టెన్ వివరించాడు. అనుకూల ఫలితం రాకపోయినా మొత్తం ప్రదర్శన చూస్తే జట్టు ఎంత ఎదిగిందో అర్థమవుతుందన్నాడు. ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ మూడు విభాగాల్లోనూ ఆటగాళ్లు పూర్తి శక్తితో ఆడారని చెప్పాడు. కష్టసమయంలోనూ వెనక్కి తగ్గలేదని గర్వంగా తెలిపాడు. అయితే చివరి ఓవర్‌లో పది పరుగులు చేయకపోవడంపై పౌడెల్ నిజాయితీగా మాట్లాడాడు. “ఆ ప్రెషర్‌ను ఇంకా బాగా హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. ఇంగ్లండ్ బౌలర్లు కూడా చివరి ఓవర్లలో ఇబ్బంది పడ్డారు. కానీ చివరి ఓవర్‌లో సామ్ కరన్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. యార్కర్లు, స్లో బౌన్సర్లు వేసి మమ్మల్ని కట్టడి చేశాడు. ఇలాంటి సందర్భాల్లో ఇంకా మెరుగ్గా ఆడటం నేర్చుకుంటాం” అని చెప్పాడు. ఏది ఏమైనప్పటికీ ఒక చిన్న టీం ఇంగ్లండ్‌కు చుక్కలు చూయించి అభిమానుల హృదయాలను గెలిచింది నేపాల్ జట్టు.
READ MORE: CM Chandrababu: నేడు మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ
