James Anderson Retirement: ఇంగ్లండ్ సీనియర్ పేసర్, స్వింగ్ కింగ్ జేమ్స్ అండర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు జిమ్మీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని శనివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇప్పటికే వన్డేలు, టీ20ల నుంచి తప్పుకున్న అండర్సన్.. త్వరలోనే టెస్టు క్రికెట్ నుంచి కూడా తప్పుకోనున్నాడు. జూలై 10 నుంచి లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న తొలి టెస్టు తనకు చివరిదని చెప్పాడు. పేస్ బౌలర్ అయిన జిమ్మీ రెండు దశాబ్దాల పాటు క్రికెట్‌లో కొనసాగడం విశేషం.
‘అందరికీ హాయ్. ఈ వేసవిలో లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో జరిగే మొదటి టెస్ట్ నా చివరి టెస్టు. 20 ఏళ్లకు పైగా నా దేశానికి ప్రాతినిథ్యం వహించడం చాలా గర్వంగా ఉంది. నా చిన్నప్పటి నుండి ఏంతో ఇష్టపడే ఆటకు విడ్కోలు పలుకుతుండడం బాధగా ఉంది. నేను ఇంగ్లండ్‌ను బాగా మిస్ అవుతా. కుర్రాళ్లకు అవకాశాలు ఇచ్చేందుకు ఇదే సరైన సమయం అని భావించా. కుర్రాళ్లు వారి కలలను సాకారం చేసుకోవాలని కోరుకుంటున్నా. దేశానికి ఆడడం కంటే గొప్ప అనుభూతి లేదు. నా ఈ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన నా కుటుంబసభ్యులకు, ఇంగ్లండ్ క్రికెట్‌కు, అభిమానులకు ధన్యవాదాలు’ అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో జేమ్స్ అండర్సన్ రాసుకొచ్చాడు.
Also Read: Hardik Pandya Captaincy: హార్దిక్ పాండ్యా సారథ్యం ఎవరికీ తీసిపోదు: కొయిట్జీ
41 ఏళ్ల జేమ్స్ ఆండర్సన్ టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు (700) తీసిన పేస్ బౌలర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2003లో జింబాబ్వేపై ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అండర్సన్.. ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌తో జరిగిన ఐదవ టెస్టులో 700 టెస్ట్ వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ షేన్ వార్న్‌ను అధిగమించేందుకు జిమ్మీ తొమ్మిది వికెట్ల దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు 187 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ20ల్లో ఇంగ్లండ్ తరఫున ఆడాడు. మొత్తంగా 400 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆండర్సన్.. 987 వికెట్లు పడగొట్టాడు. 1353 పరుగులు కూడా చేశాడు.