ENG vs SL: శ్రీలంకకు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్.. సిరీస్ కైవసం..!

  • శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లాండ్ 2-1తో కైవసం
  • మూడో వన్డేలో ఇంగ్లాండ్ 223 పరుగుల భారీ తేడాతో విజయం..
  • అంతకుముందు జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను కూడా ఇంగ్లాండ్ 3-0తో క్లీన్ స్వీప్..
Eng Vs Sl

Eng Vs Sl

ENG vs SL: శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లాండ్ 2-1తో కైవసం చేసుకుంది. అంతకముందు జరిగిన 3 టీ20 సిరీస్ ను కూడా 3-0 క్లీన్ స్వీప్ చేసింది. లండన్‌లోని ది ఓవల్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్ ఏకంగా 223 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 355 పరుగుల భారీ స్కోరు చేయగా.. 356 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 29.1 ఓవర్లలో కేవలం 132 పరుగులకే ఆలౌటైంది.

మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్ బ్యాటర్లలో టామ్ బాంటన్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. 105 బంతుల్లో 126 పరుగులు చేశాడు. అతనికి తోడుగా కెప్టెన్ హ్యారీ బ్రూక్ 66 బంతుల్లో 77 పరుగులు చేశాడు. జోర్డాన్ కాక్స్ కూడా వేగంగా 52 బంతుల్లో 76 పరుగులు సాధించాడు. విల్ జాక్స్ 25 పరుగులు చేయగా.. జామీ ఓవర్టన్ 14 బంతుల్లో 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 355/7 పరుగులు చేసింది.

శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో మూడు వికెట్లు పడగొట్టాడు. సచిందు కొలంబాగే రెండు వికెట్లు తీయగా.. దిల్షాన్ మధుశంక, జనిత్ లియానగే చెరో వికెట్ సాధించారు. అయితే ఇంగ్లాండ్ బ్యాటర్ల దూకుడును అడ్డుకోవడంలో శ్రీలంక బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ పాథుమ్ నిస్సాంక కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. కమిందు మెండిస్ 12 పరుగులు చేయగా.. కెప్టెన్ కుశాల్ మెండిస్ 26 బంతుల్లో 35 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. పావన్ రత్నాయక 18, జనిత్ లియానగే 19 పరుగులు చేశారు.

మిగతా బ్యాటర్లు ఇంగ్లాండ్ బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోయారు. దీంతో శ్రీలంక 29.1 ఓవర్లలో 132 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ బౌలర్లలో లియామ్ డాసన్ మూడు వికెట్లు పడగొట్టగా, గస్ అట్కిన్సన్ రెండు వికెట్లు తీశాడు. విల్ జాక్స్, జో రూట్, జామీ ఓవర్టన్, సోనీ బేకర్ చెరో వికెట్ సాధించారు.

ఈ సిరీస్ మొదటి వన్డేలో ఇంగ్లాండ్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో వన్డేలో శ్రీలంక 16 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో మూడో వన్డే కీలకంగా మారింది. అయితే నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 223 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో ఇంగ్లాండ్ సొంతం చేసుకుంది.