మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఈరోజు క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఇంగ్లాండ్ భారీ విజయం సాధించింది. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. ఇంగ్లీష్ జట్టు విజయంలో ఫిల్ సాల్ట్ (85; 56 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్), హ్యారీ బ్రూక్ (78; 35 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులు) కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిసి 407 పరుగులు చేశాయి. ఇది న్యూజిలాండ్, ఇంగ్లాండ్ రెండు జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో అత్యధిక స్కోరు.
న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ నిర్ణయం తప్పు అని త్వరలోనే తెలుసుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మంచి ఆరంభం ఇచ్చాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. టామ్ బాంటన్ (29), జాకబ్ బెథెల్ (24) రాణించడంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసింది. కైల్ జేమిసన్ రెండు వికెట్లు పడగొట్టినా 47 పరుగులు ఇచ్చాడు. కివీస్ బౌలర్లు 10 కంటే ఎక్కువ ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చారు.
Also Read: RDO vs DRO: విశాఖ కలెక్టరేట్‌లో ఉన్నతాధికారుల మధ్య కోల్డ్ వార్.. నెలవారీ సరకుల కోసం..!
237 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 18 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌట్ అయింది. టిమ్ సీఫెర్ట్ (39) టాప్ స్కోరర్. మిచెల్ సాంట్నర్ 36 పరుగులు చేశాడు. మరే ఇతర బ్యాట్స్‌మెన్ 30 పరుగులు చేయలేకపోయాడు. మార్క్ చాప్‌మన్ 28 పరుగులు మాత్రమే చేశాడు. టిమ్ రాబిన్సన్ (7), రచిన్ రవీంద్ర (8), డారిల్ మిచెల్ (9) విఫలమయ్యారు. ఇంగ్లాండ్ తరఫున ఆదిల్ రషీద్ 4 వికెట్లు పడగొట్టాడు. ల్యూక్ వుడ్, బ్రైడాన్ కార్స్, లియామ్ డాసన్ తలా 2 వికెట్లు పడగొట్టారు.
