కనుమరుగైపోయింది అనుకున్న ర్యాగింగ్ భూతం మళ్లీ వచ్చింది..!! మరో అమాయక విద్యార్థిని బలి తీసుకుంది. మేడిపల్లిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్‌లో సెకండ్ ఇయర్ చదువుతున్న సాయితేజ.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీనియర్లు కొట్టారని.. ర్యాగింగ్ చేస్తున్నారని.. డబ్బులు కావాలని వేధిస్తున్నారంటూ తండ్రికి సెల్ఫీ వీడియో పంపి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం నగలకొండకు చెందిన సాయితేజ.. హైదరాబాద్ మేడిపల్లిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్‌లో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నిన్న రాత్రి తన తండ్రికి వాట్సప్‌లో ఒక వీడియో పంపాడు. తనను సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారని.. కొడుతున్నారని.. డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నారు అంటూ వీడియో పంపాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పాడు.
కొడుకు ఫోన్ కాల్‌తో ఒక్కసారిగా భయాందోళనకు గురైన తండ్రి.. వెంటనే కాల్ చేశాడు. కానీ ఆన్సర్ చేయలేదు. ఫ్రెండ్స్‌కి చేశాడు.. దగ్గర్లో లేము అని, సాయి తేజ హాస్టల్‌లో ఉన్నాడని చెప్పారు. హాస్టల్ నిర్వాహకులకు కాల్ చేశాడు. రూమ్‌లోకి వెళ్లి చూడగా.. అప్పటికే సాయి తేజ మృతి చెందాడు. హాస్టల్ చేరుకున్న పోలీసులు.. సాయి తేజ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. సాయితేజ తండ్రి కూడా ఉన్నఫళంగా హైదరాబాద్ బయల్దేరి వచ్చాడు.
సాయితేజ స్నేహితులు చెబుతున్న ప్రకారం.. సాయి తేజ అతని స్నేహితులు అదే కాలేజ్‌లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న నలుగురు విద్యార్థులతో గొడవ జరిగింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఒకరిని సాయితేజ అతని స్నేహితులు కొట్టారు. ఈ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్.. గొడవ విషయాన్ని ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కి చెప్పారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మరో కాలేజ్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్న స్నేహితులు కలిసి సాయి తేజతోపాటు అతని స్నేహితులను పిలిచారు. ఇందులో లోకల్‌గా ఉండే రౌడీ బ్యాచ్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది.
మాట్లాడదాం అని పిలిచి.. సాయితేజ, అతని స్నేహితులపై దాడి చేశారు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. స్థానికంగా ఉన్న ఓ బార్‌కి తీసుకెళ్లి రౌడీ బ్యాచ్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మద్యం సేవించారు. 10 వేల రూపాయల బిల్ అయ్యింది. ఈ బిల్లును సాయి తేజ అతని స్నేహితులతో కలిసి కట్టాలని చెప్పారు. డబ్బులు లేవని ఎంత వేడుకున్నా.. ఎం చేసైనా సరే బిల్లు కట్టాల్సిందే అని చెప్పారు. దీంతో సాయి తేజ తండ్రికి కాల్ చేసి కొంత డబ్బు అడిగాడు. తన వద్ద 1500 రూపాయలు మాత్రమే ఉన్నాయని ఫోన్ పే చేశాడు. సాయి తేజ ఎంత బతిమిలాడినా వదల లేదు. అక్కడి నుంచి సాయి తేజ నేరుగా హాస్టల్ వెళ్లిపోయాడు. రూమ్‌లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి.. తండ్రికి పంపి ఆత్మహత్య చేసుకున్నాడు.
తనను సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారని.. నిత్యం వేధిస్తున్నారని వీడియోలో చెప్పాడు సాయి తేజ. డబ్బులు కావాలని కొందరు సీనియర్స్ వేధించడమే కాకుండా.. పలుమార్లు కొట్టారని చెప్పాడు సాయి తేజ. వీడియో ఆధారంగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయితేజ, అతని స్నేహితులపై దాడి చేసిన ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, రౌడీ బ్యాచ్ వివరాలు సేకరించారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
సాయి తేజ కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ.. మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు సాయి తేజ బంధువులు. తమ కొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయని.. ఆత్మహత్య కాదు, హత్య చేసి ఉరి వేసి ఉన్నారని అంటున్నాడు సాయి తేజ తండ్రి. తాను వచ్చే వరకు కూడా ఉంచకుండా.. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి ఎలా తరలిస్తారు అని ఆవేదన చెందుతున్నాడు.
ఇప్పటికే కొందరు స్టూడెంట్స్, లోకల్ రౌడీ బ్యాచ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ర్యాగింగ్ పై కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. కానీ.. ఇంత జరిగినా కాలేజ్ యాజమాన్యం మాత్రం నిర్లక్ష్యంగా స్పందించింది. సాయి తేజ కాలేజ్‌లో గొడవ పడలేదు.. బయట జరిగిన గొడవ కదా.. కాలేజ్‌కి ఏం సంబంధం లేదు అని చెప్తున్నారు సిద్ధార్థ కాలేజ్ ప్రిన్సిపాల్. హాస్టల్ నిర్వాహకులు కూడా తమకేం సంబంధం అంటూ చేతులు దులుపుకుంటున్నారు.
