ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్‌ రికార్డు విజయం.!

  • శ్రీలంకపై తొలి టీ20లో ఇంగ్లండ్ ఘన విజయం..
  • 119 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపు
  • ఇంగ్లండ్ 20 ఓవర్లలో 254/4 భారీ స్కోరు
  • హ్యారీ బ్రూక్ 49 బంతుల్లో 114 పరుగులు..
Eng Vs Sl

Eng Vs Sl

ENG vs SL: సౌతాంప్టన్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 254 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో శ్రీలంక 19 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ 119 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

ఇంగ్లండ్ భారీ స్కోరుకు కెప్టెన్ హ్యారీ బ్రూక్ ప్రధాన కారకుడిగా నిలిచాడు. అతడు కేవలం 49 బంతుల్లోనే 232.65 స్ట్రైక్‌రేట్‌తో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సునామీతో 114 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 42 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి తన టీ20 కెరీర్‌లో అత్యంత వేగవంతమైన శతకంతో శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

మరోవైపు బ్రూక్‌కు జోస్ బట్లర్ కూడా అద్భుతంగా సహకరించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బట్లర్ 44 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. వీరి దూకుడుతో ఇంగ్లండ్ పవర్‌ప్లే ముగిసేసరికి 90 పరుగులు చేయగలిగింది.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 254 పరుగులు చేయడం ద్వారా శ్రీలంకపై టీ20ల్లో తన అత్యధిక స్కోరును నమోదు చేసింది. అంతేకాకుండా వరుసగా రెండో టీ20లో 250కుపైగా పరుగులు చేసింది. అంతకుముందు 2026 జూలైలో సౌతాంప్టన్‌లోనే భారత్‌తో జరిగిన టీ20లో ఇంగ్లండ్ 257 పరుగులు చేసింది. టీ20ల్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 250కుపైగా స్కోర్లు చేసిన జట్ల జాబితాలో భారత్, నేపాల్ తర్వాత ఇంగ్లండ్ చేరింది.

255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. పాతుమ్ నిస్సాంక 12, కమిల్ మిశారా 10, లహిరు ఉదారా 5, చరిత్ అసలంక 10 పరుగులకే వెనుదిరిగారు. దసున్ శనక 24, దునిత్ వెల్లాలగే 33 పరుగులతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. చివరకు శ్రీలంక 19 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది.

ఇంగ్లండ్ బౌలర్లలో సోనీ బేకర్ కేవలం 12 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అతనికి తోడుగా లియామ్ డాసన్, జేమీ ఓవర్టన్ చెరో రెండు వికెట్లు తీశారు. జోష్ టంగ్, విల్ జాక్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక శ్రీలంకను 119 పరుగుల భారీ తేడాతో ఓడించడం ద్వారా ఇంగ్లండ్‌ రికార్డు విజయాన్ని నమోదు చేసింది. రన్స్ పరంగా ఇంగ్లండ్‌పై శ్రీలంకకు ఇదే అతిపెద్ద ఓటమి. అలాగే 2014 తర్వాత టీ20ల్లో ఇంగ్లండ్‌పై శ్రీలంక విజయం సాధించలేకపోయింది.