Site icon NTV Telugu

Shubman Gill: ఆటగాళ్ల కెప్టెన్‌గా ఉంటా.. ప్రత్యేకమైన శైలి అంటూ ఏమీ లేదు!

Gill Gautam Gambhir

Gill Gautam Gambhir

తాను ఆటగాళ్ల కెప్టెన్‌గా ఉంటానని టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. కెప్టెన్‌గా ప్రత్యేకమైన శైలి అంటూ ఏమీ లేదన్నాడు. టెస్ట్ కెప్టెన్సీ సవాల్‌తో కూడుకున్నదని, ఛాలెంజ్‌ను స్వీకరించేందుకు తాను సిద్దంగా ఉన్నానని చెప్పాడు. ఓ బ్యాటర్‌గా జట్టును ముందుండి నడిపించాలని అనుకుంటున్నానని పేర్కొన్నాడు. భారత జట్టులో నాణ్యమైన పేసర్లు ఉన్నారని గిల్‌ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి గిల్‌ గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు విషయాలు పంచుకున్నాడు.

Also Read: Gautam Gambhir: బుమ్రా లేకున్నా ఏం కాదు.. గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

‘ప్రస్తుతం భారత జట్టులో నాణ్యమైన పేసర్లు ఉన్నారు. మా పేస్ విభాగం పటిష్టంగా ఉంది. తగినంత మంది బౌలర్లు ఉన్నారు. మా ఫాస్ట్‌ బౌలర్లు ఎలాంటి స్థితిలో అయినా జట్టును గెలిపించగలరు. కెప్టెన్‌గా నేను ప్రత్యేకమైన శైలిని ఏమీ అనుసరించను. ఆటగాళ్లతో మాట్లాడతా. వాళ్లలో భద్రతా భావాన్ని కలిగిస్తా. ప్లేయర్స్ బలాలు, బలహీనతల గురించి చర్చిస్తా. ఓ కెప్టెన్‌గా ఇది చాలా ముఖ్యం. భద్రతా భావం కలిగినప్పుడే ఆటగాళ్లు నూరు శాతం కష్టపడతారు. నేను ఆటగాళ్ల కెప్టెన్‌గా ఉంటా. ఇంగ్లండ్ పర్యటనలో ఓ బ్యాటర్‌‌గా జట్టును ముందుండి నడిపించాలనుకుంటున్నా. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సుదీర్ఘ కాలం భారత జట్టుకు ఆడి ఎన్నో అద్భుత విజయాలు అందించారు. ఈ ఇద్దరి స్థానాలను భర్తీ చేయడం చాలా కష్టం’ అని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చెప్పాడు.

Exit mobile version