Site icon NTV Telugu

Gautam Gambhir: బుమ్రా లేకున్నా ఏం కాదు.. గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

Gautam Gambhir

Gautam Gambhir

టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రాకు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో కొన్ని మ్యాచ్‌ల నుంచి విశ్రాంతినిచ్చే అవకాశముంది. పనిభార నిర్వహణలో భాగంగా బుమ్రా మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడనున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో బుమ్రా అన్ని మ్యాచ్‌లూ ఆడే అవకాశం లేదని జట్టు ఎంపిక సందర్భంలోనే చీఫ్‌ సెలక్టర్‌ అజిత్ అగార్కర్ చెప్పారు. తాజాగా టీమిండియా కోచ్‌ గౌతమ్ గంభీర్‌ మాట్లాడుతూ.. బుమ్రా లేకున్నా భారత జట్టుపై ప్రభావం పడదని, అతడి గైర్హాజరీలోనూ రాణించే పేస్‌ విభాగం భారత్‌కు ఉందన్నారు. ఇంగ్లండ్‌తో భారత్ టెస్టు సిరీస్‌ నేపథ్యంలో ముంబైలో కెప్టెన్‌ శుభ్‌మ‌న్ గిల్‌తో కలిసి గౌతమ్ గంభీర్‌ గురువారం మీడియాతో మాట్లాడారు.

‘ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఏ మూడు మ్యాచ్‌ల్లో జస్ప్రీత్ బుమ్రాను ఆడించాలనే దాని గురించి మేమింకా నిర్ణయం తీసుకోలేదు. అయితే అతడు మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడన్నది ఇంకా ఖరారు కాలేదు. బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడం కష్టమే. కానీ భారత బౌలింగ్‌ దళంలో మంచి నాణ్యత ఉంది. బుమ్రా గైర్హాజరీ మరొకరికి సత్తా చాటేందుకు అవకాశం ఉంటుందని ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 సందర్భంగా కూడా చెప్పా. ప్రస్తుతం భారత జట్టులో ప్రతిభావంతులకు కొదువ లేదు’ అని కోచ్‌ గౌతమ్ గంభీర్‌ చెప్పారు. ఇటీవలి కాలంలో బుమ్రా గాయాల పాలవుతున్న విషయం తెలిసిందే.

ఇంగ్లండ్ పర్యటనలో తాను ఐదు టెస్ట్‌లు ఆడలేనని బీసీసీఐకి జస్ప్రీత్ బుమ్రా సమాచారం ఇచ్చాడు. ప్రస్తుతం తన శరీరం మూడు టెస్ట్‌ల కంటే ఎక్కువ సహకరించిందని, ఇంగ్లండ్ పర్యటనలో అన్ని టెస్ట్‌లు తాను ఆడలేనని బీసీసీఐ సెలెక్టర్లకు చెప్పాడు. బుమ్రా పరిస్థితిని అర్ధం చేసుకున్న బీసీసీఐ.. ఆయన అభ్యర్థనకు ఓకే చెప్పింది. మరి బుమ్రా ఏ మూడు టెస్టులు ఆడుతాడో చూడాలి. మొహమ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్షదీప్‌ సింగ్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నారు.

 

Exit mobile version