జూన్ 10 నుంచి ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో మధ్యాహ్నం 3.30కి మూడో టెస్ట్ ఆరంభం కానుంది. తొలి టెస్టులో ఓటమి అనంతరం పుంజున్న భారత్.. రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మూడో టెస్టులో గెలిచి ఆధిక్యం సంపాదించాలని చూస్తోంది. మరోవైపు లార్డ్స్‌లో సత్తా చాటాలని ఇంగ్లండ్ బావిస్తోంది. అయితే రెండో టెస్టులో సత్తాచాటిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పలు రికార్డులపై కన్నేశాడు.
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు రెండు టెస్టులు ఆడిన శుభ్‌మన్ గిల్.. 585 పరుగులు చేశాడు. గిల్ మరో 9 పరుగులు చేస్తే.. ఇంగ్లండ్‌లో ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్‌గా నిలుస్తాడు. 2018లో విరాట్ కోహ్లీ 593 పరుగులు చేశాడు. విరాట్ రికార్డును గిల్ బ్రేక్ చేయనున్నాడు. 71 పరుగులు చేస్తే కోహ్లీ పేరిటే ఉన్న ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు (655) చేసిన కెప్టెన్‌గా గిల్ నిలుస్తాడు. మంచి ఫామ్‌లో ఉన్న గిల్ మూడో టెస్టులో విరాట్ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.
శుభ్‌మన్ గిల్ మరో 18 పరుగులు చేస్తే భారత్ తరఫున ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. 2002లో రాహుల్ ద్రవిడ్ 602 పరుగులు బాదాడు. గిల్ మరో 190 పరుగులు చేస్తే ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. 1971లో వెస్టిండీస్‌పై నాలుగు మ్యాచుల్లో సునీల్ గవాస్కర్ 774 పరుగులు చేశాడు. ఇక ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా సర్ డాన్ బ్రాడ్‌మన్ ఉన్నాడు. ఇంగ్లండ్‌పై 1930లో 5 టెస్టులలో 974 పరుగులు చేశాడు. వాలీ 1929లో హమ్మోండ్ 908 పరుగులు చేశాడు. ప్రస్తుతం గిల్ రెండు టెస్టుల్లోనే 585 రన్స్ చేశాడు. ఇంకా మూడు టెస్టులు ఉన్న నేపథ్యంలో బ్రాడ్‌మన్‌ను అధిగమించే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి గిల్ ఎలా రాణిస్తాడో.
