Site icon NTV Telugu

ENG vs IND: మేం ఏం స్టుపిడ్స్‌ కాదు.. ఇంగ్లండ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Marcus Trescothick

Marcus Trescothick

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టు మ్యాచ్‌లో భారత్ పట్టు బిగించింది. ఇంగ్లండ్‌ ముందు 608 పరుగుల భారీ లక్షాన్ని ఉంచిన టీమిండియా.. ఇప్పటికే మూడు వికెట్లు తీసి విజయం దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలవాలంటే ఈ రోజు 536 పరుగులు చేయాలి. ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లీష్ జట్టు.. ఆచితూచి ఆడి డ్రా చేసుకుంటుందా? లేదా తమ ‘బజ్‌బాల్‌’ ఆటనే కొనసాగిస్తుందా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐదవ రోజు ఆటపై ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది కఠిన సవాల్‌తో కూడుకున్న టార్గెట్‌ అని తాము తెలుసుకోలేనంత స్టుపిడ్స్‌ కాదని తెలిపాడు.

‘ఇప్పుడున్న జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌ చాలా భిన్నమైంది. ఈ సమయంలో డ్రా గురించి కూడా ఆలోచించని స్టుపిడ్స్‌ మేం కాదు. ఒక టెస్ట్ మ్యాచ్‌లో ముగింపు మూడు విధాలుగా ఉంటుంది. గెలుపు, ఓటమి, లేదా డ్రాగా ఫలితం వస్తుంది. భారత్ ఇచ్చిన టార్గెట్ చాలా కఠినమైనదని మాకు తెలుసు. భారత జట్టు మాకు 550 పరుగుల లక్ష్యం ఇస్తుందేమో అనుకున్నాం. కానీ 600కి పైగా స్కోరు ఇచ్చింది. మేం ఒక్క రోజులో 536 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ ఇన్నింగ్స్‌లో బంతి సాఫ్ట్‌గా మారిన తర్వాత కొన్ని ఓవర్లపాటు (10-15) మేము ఎక్కువగా బౌలింగ్ చేయాల్సి వచ్చింది. మేము డిక్లరేషన్ కోసం చూస్తుండగా.. టీమిండియా భారీ స్కోరు దిశగా వేగంగా పరుగులు చేసింది. ఇప్పుడు అసలు విషయమేమిటంటే.. ఈ లక్ష్యాన్ని చేధించే దిశగా మేము ఎలా బ్యాటింగ్‌ చేస్తామన్నదే కీలకం. మేము తప్పకుండా పాజిటివ్ ఫలితాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రయత్నిస్తాం. అని మార్కస్ ట్రెస్కోథిక్ స్పష్టం చేశాడు.

Also Read: Yuzvendra Chahal: దేశం మొత్తం తెలుసు.. డేటింగ్‌పై స్పందించిన చహల్!

భారత్‌ నిర్దేశించే ఎంత లక్ష్యం అయినా తాము ఛేదిస్తాం అని హ్యారీ బ్రూక్ అన్న విషయం తెలిసిందే. బ్రూక్ వ్యాఖ్యలకు బిన్నంగా మార్కస్ ట్రెస్కోథిక్‌ స్పందించాడు. ఇక ఐదో రోజు వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే ఇంగ్లండ్‌కు ప్రయోజనం చేకూరుతుంది. మ్యాచ్‌ మొదలుకావడానికి గంట ముందు చిన్నపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఆక్యూ వెదర్‌ పేర్కొంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇంగ్లండ్ కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలు మ్యాచ్ ఆరంభం అవుతుంది.

Exit mobile version