Site icon NTV Telugu

ENG vs IND: అర్ష్‌దీప్‌ సింగ్‌ ఔట్.. టీమిండియాలోకి సీఎస్‌కే నయా బౌలర్ ఎంట్రీ!

Anshul Kamboj

Anshul Kamboj

Arshdeep Singh Out, Anshul Kamboj to play ENG vs IND 4th Test 2025: టెస్ట్ సిరీస్‌లోని నాలుగో మ్యాచ్ బుధవారం (జూలై 23) నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందే భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. జూలై 17న ప్రాక్టీస్ సెషన్‌లో బంతిని ఆపుతుండగా.. అర్ష్‌దీప్ ఎడమ చేతికి గాయం అయింది. దాంతో నాలుగో టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేయాలనుకున్న అర్ష్‌దీప్ ఆశలు ఆవిరయ్యాయి. అర్ష్‌దీప్‌ను స్వదేశానికి పంపించే అవకాశం ఉంది.

అర్ష్‌దీప్‌ సింగ్‌ స్థానంలో దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టిన అన్షుల్ కాంబోజ్‌కు ఛాన్స్ వచ్చింది. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుతో అన్షుల్ చేరనున్నాడు. ఈ విషయంపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-ఎ తరఫున రెండు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అన్షుల్.. ఐదు వికెట్లు, ఒక హాఫ్ సెంచరీ చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 24 మ్యాచులు ఆడి 22.88 సగటుతో 79 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 486 పరుగులు కూడా చేశాడు. టెయిలెండర్‌గా బ్యాటింగ్‌కు వచ్చి విలువైన పరుగులు చేస్తుండడం అన్షుల్‌కు కలిసొచ్చే అంశం. దేశీయ క్రికెట్‌లో అన్షుల్ హర్యానాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున ఆడి మంచి ప్రదర్శన చేశాడు. 8 మ్యాచ్‌ల్లో 21.50 సగటుతో 8 వికెట్లు పడగొట్టాడు.

Also Read: Pulasa Fish Price: యానాంలో పులసల సందడి.. ఈరోజు కిలో పులసకు రికార్డు ధర!

బీసీసీఐకి చెందిన ఒక వ్యక్తి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ… ‘ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తీవ్ర గాయానికి గురయ్యాడు. అతని చేతికి కుట్లు కూడా పడ్డాయి. అర్ష్‌దీప్ పూర్తి ఫిట్‌గా మారడానికి కనీసం పది రోజులు పడుతుంది. అన్షుల్ కాంబోజ్‌ను భారత జట్టులో చేర్చాలని బీసీసీఐ సెలెక్టర్లు నిర్ణయించారు’ అని తెలిపారు. ప్రస్తుతం నాలుగో టెస్ట్ తుది జట్టు ఎంపిక విషయంలో తీవ్ర చర్చ నడుస్తోంది. బుమ్రాను కొనసాగించాలా?, సిరాజ్‌కూ రెస్ట్‌ ఇస్తారా?, అన్షుల్ అరంగేట్రం ఖాయమేనా?, కుల్దీప్ యాదవ్‌కు అవకాశం వస్తుందా? అనే చర్చ నెట్టింట జోరుగా సాగుతోంది.

భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, అన్షుల్ కాంబోజ్, కుల్దీప్ యాదవ్.

 

Exit mobile version