Space X Shares: ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. పిల్లలకూ స్పేస్ ఎక్స్ షేర్లు ఇస్తాం..

Elon Musk (1)

Elon Musk (1)

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అమెరికాలోని ప్రతి చిన్నారికి తన అంతరిక్ష, ఏఐ సంస్థ ‘స్పేస్‌ఎక్స్’లో రెండు షేర్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. బుధవారం స్పేస్‌ఎక్స్ షేరు ముగింపు ధర 127.44 డాలర్ల ప్రకారం, ఈ విరాళం మొత్తం విలువ దాదాపు 18 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1.50 లక్షల కోట్లకు పైగా) చేరుకోనుంది. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (X) వేదికగా మస్క్ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ ప్రకటన ప్రకారం.. ప్రతి చిన్నారికి స్పేస్‌ఎక్స్ సంస్థ తరఫున ఒక కొత్త ‘క్లాస్ ఏ’ షేరు, మస్క్ వ్యక్తిగత వాటా నుంచి మరో షేరు లభిస్తాయి. 18 ఏళ్ల లోపు అమెరికన్ పిల్లలకు చిన్న వయసు నుంచే స్టాక్ మార్కెట్‌లో భాగస్వామ్యం కల్పించి, సంపద సృష్టించేందుకు ఉద్దేశించిన ‘ట్రంప్ అకౌంట్’ పథకం కింద ఈ షేర్లను కేటాయిస్తున్నారు. గత నెల వరకు దాదాపు 7 కోట్ల ఖాతాలు తెరిచినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. స్పేస్‌ఎక్స్ సంస్థ ఇచ్చే షేర్లను వచ్చే నెలలోనే బదిలీ చేస్తామని, తన వ్యక్తిగత వాటా షేర్లను లాకప్ పిరియడ్ ముగిసిన తర్వాత వచ్చే ఏడాది జూన్‌లో అందిస్తానని మస్క్ స్పష్టం చేశారు.

సుమారు 824 బిలియన్ డాలర్ల నికర ఆస్తులు కలిగిన మస్క్ వద్ద జూన్ నాటికి 6.42 బిలియన్ల స్పేస్‌ఎక్స్ షేర్లు ఉన్నాయి. గత నెలలో స్పేస్‌ఎక్స్ అధ్యక్షురాలు గ్వినే షాట్‌వెల్ దంపతులు కూడా 20 లక్షల మందికి పైగా పిల్లలకు ఒక్కో షేరు ఇస్తామని ప్రకటించారు. కృత్రిమ మేధస్సు (AI) విప్లవం ద్వారా వచ్చే భారీ లాభాలను సమాజంతో పంచుకునే విషయంలో టెక్ దిగ్గజాల మధ్య భిన్నమైన వ్యూహాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే పబ్లిక్ ఇష్యూకు వచ్చిన మస్క్ ప్రత్యర్థి సంస్థ ‘ఆంథ్రోపిక్’, ప్రజా శ్రేయస్సు కోసం 54 బిలియన్ డాలర్ల విలువైన 5 శాతం షేర్లను ప్రత్యేక నిధికి కేటాయించగా, మస్క్ నేరుగా పిల్లలకు షేర్లు అందించే మార్గాన్ని ఎంచుకున్నారు.